ఎన్నికల వేళ కేసీఆర్ కీలక నిర్ణయం - రేవంత్ కు చెక్..!!
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలకంగా కాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ రాజకీయ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. తుంటికి సర్జరీ కారణంగా విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ మరి కొద్ది రోజుల్లోనే ప్రజల్లోకి రావాలని నిర్ణయించారు. లోక్ సభ ఎన్నికలకు కేడర్ ను సంసిద్దులను చేసే బాధ్యతలు తీసుకుంటున్నారు. జిల్లాల పర్యటనలకు సిద్దమవుతున్నారు. ప్రతీ రోజు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు.
ప్రజల్లోకి కేసీఆర్ : బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహంతో ఉన్న కేడర్ లో జోష్ తెచ్చేందుకు తానే రంగంలోకి దిగాలని నిర్ణయించారు. అదే సమయంలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కేసీఆర్ సమాయత్తం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్, వ్యక్తిగతంగా కేసీఆర్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సస్ రేవంత్ నాయకత్వానికి పరీక్షగా మారనున్నాయి.

కేడర్ కు అందుబాటులో : కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మార్చి 17వ తేదీతో వంద రోజుల సమయం ముగియనుంది. పథకాల అమలు పైన ఒత్తిడి..తమ పాలన పైన చేస్తున్న విమర్శలకు ప్రజల మధ్య నుంచే సమాధానం చెప్పాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. కేసీఆర్ త్వరలోనే జిల్లాల పర్యటన ప్రారంభిస్తారని పార్టీ ముఖ్యనేత హరీష్ వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని పేర్కొన్నారు. ఫిబ్రవరి లో తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారని ప్రకటించారు. ప్రభుత్వం కేసీఆర్ కిట్లపై కేసీఆర్ గుర్తును తొలగించినా తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు.

రేవంత్ వర్సస్ కేసీఆర్ : బీఆర్‌ఎస్ హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను రద్దులు చేస్తూ వాయిదాలు వేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యల పై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమం లో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేదని చెప్పుకొచ్చారు.ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వానికి అందజేసిన ధాన్యం డబ్బులను, రైతు బంధు పథకం డబ్బులను ప్రభుత్వం వేయలేదని పేర్కొన్నారు. పదేండ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని హరీష్ వివరించారు. సత్తా ఏమిటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications