కేసీఆర్ లోక్ సభకా - అసెంబ్లీకా : సరైన సమయంలో సరైన నిర్ణయం : లెక్క పక్కా - వాట్ నెక్స్ట్..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రాజకీయ నినాదం ఎత్తుకున్నారు. తాను పదవుల కోసం కాదు..దేశం కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. దేశంలో కొత్త రాజ్యాంగం రావాలని డిమాండ్ చేసారు. కొత్త ఆలోచన, కొత్త దిశ, కొత్త రాజ్యాంగం అన్నది తమ విధానమని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ పైన స్పందించిన కేసీఆర్..దీనికి కొనసాగింపుగా చేసిన రాజకీయ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు కారణమయ్యాయి.
Recommended Video
ప్రధాని మోదీ.. కేంద్రంలో కాంగ్రెస్ - బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీ ల నేతలతో సీఎం కేసీఆర్ తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఫ్రంట్.. టెంట్ లేదని చెబుతున్నారు. కానీ, బీజేపీ -కాంగ్రెస్ వ్యతిరేక ముఖ్యమంత్రులు..పార్టీల అధినేతలతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్
దీని ద్వారా సీఎం కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లు ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం అని చెప్పటం ద్వారా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా తెలంగాణ సీఎం గా తన వారసులు సమర్ధులుగా ఇప్పటికే గుర్తింపు రావటంతో..ఆ దిశగానూ నిర్ణయం తీసుకొనే సమయం ఆసన్నమవుతోందని తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేటీఆర్ ను సీఎం చేయటం పైన ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దంటూ గతంలో సీఎం కేసీఆర్ చేసిన హెచ్చరికల కారణంగా పార్టీ నేతలు ఎవరూ ఈ అంశం పైన ఇప్పుడు ఓపెనగా మాట్లాడటం లేదు.
కానీ, కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తారా.. పార్లమెంట్ కు పోటీ చేస్తారా అనేది కీలక చర్చకు కారణమవుతోంది. కానీ, కేసీఆర్ మాత్రం తాను సీఎంగా ఉంటూనే పోరాటం చేస్తానని స్పష్టం చేసారు.

త్వరలో కార్యాచరణ
బీజేపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితేనే అభివృద్ధి సాధ్యమని..త్వరలో మా కార్యాచరణ ప్రారంభిస్తామంటూ కేసీఆర్ క్లియర్ గా చెప్పుకొచ్చారు. అదే సమయంలో.. ఫెడరల్ ఫ్రంట్ అని తాను ఏనాడూ చెప్పలేదన్నారు. ప్రధాని పదవి ఎవరికి దక్కుతుందనేది అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. దేశానికి కొత్త ఎజెండా కావాలన్నారు. రేపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరంటూ మరింత ఆసక్తి పెంచారు.
ప్రజలను జాగృతం చేసేందుకు ఏ పద్ధతిలో ముందుకు పోవాలనే దానిపై త్వరలో హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల సదస్సులో మేధోమథనం చేస్తామని వెల్లడించారు. విప్లవాల కోసం తుపాకీ అవసరం లేదని చెబుతూ... నాగరిక ప్రపంచంలో ఇందిరాగాంధీ వంటి నాయకురాలు గద్దె దిగిందనే విషయాన్ని గుర్తు చేసారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముస్లిం సమాజానికి ఒక దిక్కుగా మారాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

త్వరలో ముంబాయికి ముఖ్యమంత్రి
ఉమ్మడి ఏపీలో తమ రాజకీయ మనుగడను నిలుపుకొన్న ఎంఐఎం.. ఇప్పుడు మహారాష్ట్ర, బిహార్ వంటి చోట్లా తమ ఉనికిని చాటుతోందని చెప్పుకొచ్చారు. ముందస్తు ఎన్నికలు వస్తయని కొందరు బేవకూఫ్ గాళ్లు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మేం 95 నుంచి 105 మధ్య సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామంటూ మరో సంచలనానికి తెర లేపారు.
నేను కేసీఆర్‌ను.. వెనక్కి తగ్గే రకం కాదు అంటూ వ్యాఖ్యానించటం ద్వారా సీఎం తన భవిష్యత్ కార్యాచరణ పైన పక్కా ప్రణాళిక మేరకే ముందుకు వెళ్తున్నట్లుగా స్పష్టం అవుతోంది. టీఆర్‌ఎస్ పుట్టిన తర్వాత చంద్రబాబు, బీజేపీ, కమ్యూనిస్టులతోపాటు అందరిచేతా జైతెలంగాణ అనిపించామని.. రేపు కూడా కలిసి వచ్చే పార్టీలు, ప్రజలు కదలివస్తారన్నారు. డీఎంకే, ఆర్జేడీనే కాదు.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో మాట్లాడానని చెప్పారు.

రాజ్యంగం పైనా కీలక వ్యాఖ్యలు
రెండు మూడు రోజుల్లో ముంబై వెళ్లి నా ఆలోచనను ఆయన ముందు పెడతానని స్పష్టం చేసారు. దీనికి కొనసాగింపుగా.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూనే మోదీ ప్రధాని అయ్యారనే అంశాన్ని కేసీఆర్ గుర్తు చేయటం విశ్లేషకులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను కూడా పార్లమెంటుకు పోటీ చేశాననే విషయాన్ని గుర్తు చేసారు.
ఏదీ అసాధ్యం కాదంటూనే... అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే యువశక్తి, వనరులు భారత్‌కు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాటిని గరిష్టంగా నియోగించుకుని నా శక్తిమేర కృషి చేస్తానని వెల్లడించారు. దీని ద్వారా... మరోసారి కేసీఆర్ రానున్న రోజుల్లో ఇటు తెలంగాణలో అవసరమైన మేర నిర్ణయాలు తీసుకుంటూ..అటు జాతీయ రాజకీయాల్లోనూ తన స్థానం సుస్థిరం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications