రేవంత్ పై కేసీఆర్ కౌంటర్ స్ట్రాటజీ - నేరుగా బరిలోకి..!!
తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ బాట పట్టారు. దీంతో..బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటనే చర్చ మొదలైంది. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పుడు కేసీఆర్ రైతల వద్దకు వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టేందుకు సిద్దమయ్యారు.
తెలంగాణలో రాజకీయం పదునెక్కింది. సీఎం రేవంత్ ఆపరేషన్ బీఆర్ఎస్ కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ కోలుకోకుండా దెబ్బ తీసే వ్యూహం అమలు చేస్తున్నారు. కడియం, కేకే వంటి సీనియర్లతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలను తమ పార్టీ లోకి చేర్చుకొనేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. బీఆర్ఎస్ ను ఎంత మంది వీడినా ఎలాంటి నష్టం ఉండదని..కొత్త నాయకత్వం తయారు చేసుకుంటామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు కేసీఆర్ కొత్త కార్యాచరణ నిర్ణయించారు. నేటి నుంచి కేసీఆర్ పొలం బాట పట్టనున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆయన రైతన్నల పరామర్శలు మొదలుపెట్టనున్నారు. తెలంగాణలో అకాల వర్షాలతో పాటు, నీరు అందక పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం దారవత్ తండాలో, పదకొండున్నరకు సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లిలో ఎండి పోయిన పంటల పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో మీడియా సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీల అమలుపై కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశముంది.
పంట నష్టపోయిన అన్నదాతలకు తగిన పరిహారం చెల్లించాలని కూడా కేసీఆర్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల వేళ కేసీఆర్ పొలంబాట రాజకీయంగా కీలకంగా మారుతోంది. పొలంబాటతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంతో పాటు రైతాంగానికి దగ్గరయ్యేందుకు యోచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పైన కేసీఆర్ స్పందించనున్నారు. దీంతో, కేసీఆర్ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పైన ఏ విధంగా స్పందిస్తారు..కవిత అరెస్ట్ తో సహా తమ పార్టీ నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేరికల పైన ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications