బాబును తిట్టి తప్పించుకుంటారా: కేసీఆర్‌పై ఫైర్
హైదరాబాద్/మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తిడుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. వ్యవసాయానికి 8 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఈ ధర్నాలో వారు మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్తపడి ఏపీలో విద్యుత్ సమస్య రాకుండా చూస్తున్నారని, కేసీఆర్ సోమరితనం వల్లే తెలంగాణలో విద్యుత్ సమస్య తలెత్తిందని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం అందమైన అబద్దాలు ఆడటంలో కేసీఆర్ సిద్దహస్తుడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇప్పటికైనా మేల్కొనాలన్నారు. ప్రభుత్వం రైతుల్లో ఆత్మస్థైర్యం నింపాలన్నారు.
రైతు ఆత్మహత్యల పైన కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ పీసీసీ అద్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. నిరసన చేపట్టిన రైతుల పైన కేసులు పెట్టించడం ప్రభుత్వం దౌర్భాగ్య స్థితికి నిదర్శనమన్నారు. కేసీఆర్ రైతు హంతకుడు అని ధ్వజమెత్తారు.

కేసీఆర్ ఇలాగే పాలన చేస్తే పరిహారం తప్పదని హెచ్చరించారు. రైతులతో పెట్టుకుంటే చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని హెచ్చరించారు. కేసీఆర్ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా చీటర్ అని, ఓ దొంగ అని పొన్నాల ధ్వజమెత్తారు.
ఓట్ల కోసమే కేసీఆర్ అమలు కానీ హామీలు ఇచ్చారని శాసన మండలి సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీ శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు వారంలోగా అమలయ్యేలా చూడాలన్నారు. తాము అధికారం కోసం ధర్నాలు చేయడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. నిత్యం చంద్రబాబును తిడుతూ కేసీఆర్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
విద్యుత్ విషయంలో తాను తెలంగాణ రాష్ట్ర మంత్రులతో చర్చకు సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. మూడేళ్ల తర్వాతనైనా తెరాస నేతలు చెబుతున్నట్లుగా విద్యుత్ వస్తే తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు. కేసీఆర్ తన కుటుంబం గురించి తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదన్నారు. సీఎంలిద్దరూ (బాబు, కేసీఆర్) దొందు దొందే అన్నారు.
తెలంగాణలో విద్యుత్ సమస్యపై కలెక్టరేట్ ఎదుట టి.కాంగ్రెస్ నేతలు సోమవారం మహాధర్నా నిర్వహించారు. రైతులకు 9 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. పొన్నాల, జైపాల్‌రెడ్డి, డీఎస్, వీహెచ్, డీకే అరుణ, షబ్బీర్ అలీ, పొంగులేటి, భట్టి విక్రమార్క పలువురు నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రుల అహంకారపూరిత ధోరణి వల్లే తెలంగాణ రైతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, ప్రజా సమస్యలను గాలికి వదిలి కేసీఆర్, చంద్రబాబు బాక్సింగ్ ఆడుకుంటున్నారని వీ హనుమంత రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జలవిద్యుత్ కోసమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారన్నారు. విద్యుదుత్పత్తి నిలిపివేయాలనడం చంద్రబాబుకు సరికాదన్నారు. మావోయిస్టుల పేరుతో చత్తీసగఢ్ లైన్‌కు కేసీఆర్ మంగళం పాడారని ఆరోపించారు. కేసీఆర్ పచ్చి అబద్దాలకోరని తేలిపోయిందన్నారు. కాగా, ధర్నాకు దిగిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications