కేసీఆర్ ఆగ్రహం, చంద్రబాబు 'కొత్త' ఆశ: ఇద్దరు సీఎంలకు అమిత్ షా షాక్
నియోజకవర్గాల పునర్విభజన కోసం ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు వేచి చూస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అధికార పార్టీలకు లబ్ధి చేకూరే అవకాశముంది.
హైదరాబాద్/విజయవాడ: నియోజకవర్గాల పునర్విభజన కోసం ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు వేచి చూస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అధికార పార్టీలకు లబ్ధి చేకూరే అవకాశముంది.
చదవండి: ఇది అమిత్ షా, బిజెపి వ్యూహం
అయితే, తనపై కేసీఆర్ ఆగ్రహం, తన పార్టీలో చేరిన వారి కోసం చంద్రబాబు ప్రయత్నాలను గమనించిన బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా నియోజకవర్గాల పెంపుపై వేచి చూసే ధోరణిని అవలంభించవచ్చునని అంటున్నారు.

కేసీఆర్ ఆగ్రహం
అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. తన పర్యటనలో ఆయన తెలంగాణకు రూ.లక్ష కోట్లు ఇస్తున్నామని ప్రకటించారు. దీనిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇచ్చింది 67వేల కోట్లేనని, లక్ష కోట్లు అని ఎలా చెబుతారని నిలదీశారు. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. అయిదేళ్లలో రూ.లక్ష కోట్లు అని అమిత్ షా చెప్పారని, కేసీఆర్ తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.

చంద్రబాబు ఆశలు
మరోవైపు, ఏపీలో టిడిపి వైపు పెద్ద ఎత్తున వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా నియోకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవి తీవ్రరూపం కూడా దాలుస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గాలు పెరిగితే అందరి నేతలకు టిక్కెట్లు ఇచ్చి, 2019 ఎన్నికల నాటికి సర్దుబాటు చేయవచ్చునని భావిస్తున్నారు.

పునర్విభజన జరిగితే...
ఏపీ, తెలంగాణల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పెద్ద ఎత్తున పెరుగుతాయి. తెలంగాణలో ప్రస్తుతం 119 నియోజకవర్గాలు ఉన్నాయి అవి 153కు పెరుగుతాయి. ఏపీలో 175 సీట్లు ఉన్నాయి. అవి 225కు పెరుగుతాయి. విభజన బిల్లు యాక్టులో సవరణ చేసి, పార్లమెంటులో బిల్లు పెడితే నియోజకవర్గాల పునర్విభజనకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇది బిజెపి చేతిలో ఉంది.

తాను దెబ్బతిని, చంద్రబాబును దెబ్బకొట్టిన కేసీఆర్
నియోజకవర్గాల పునర్విజన ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రమంత్రులు పలుమార్లు చెప్పినప్పటికీ.. తమకు ఎంతోకొంత లాభిస్తుందనుకుంటే అధికార పార్టీలకు లాభం జరిగినా 2019లోపు చేయాలనుకున్నారు. కానీ అమిత్ షా తెలుగు రాష్ట్రాల పర్యటన తర్వాత అది యూ టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. తమ పార్టీ తెలంగాణలో ఎదగాలని తాను చేసిన ప్రయత్నాలను కేసీఆర్ అడ్డుకోవాలని చూడటం, అలాగే చంద్రబాబు తన పార్టీలో చేరే వారి కోసం నియోజకవర్గాల పెంపను కోరుతున్నారని భావిస్తున్న అమిత్ షా నియోజకవర్గాల పెంపు అంశాన్ని పక్కన పెట్టించవచ్చునని అంటున్నారు. ఓ విధంగా కేసీఆర్ ఆగ్రహం అమిత్ షా ఈగోను హర్ట్ చేసిందని, అది నియోజకవర్గాల పెంపుపై పడవచ్చునని, కేసీఆర్ కోపం ఏపీలో చంద్రబాబును కూడా ఇబ్బందులకు గురి చేసిందని అంటున్నారు.

లాభమా.. ఆరా తీసిన అమిత్ షా
సమాచారం మేరకు.. పునర్విభజన వల్ల బిజెపికి ఏమైనా లాభం ఉంటుందా అని అమిత్ షా ఇరు తెలుగు రాష్ట్రాల కార్యకర్తల నుంచి ఆరా తీశారని తెలుస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్, మజ్లిస్ పార్టీకి లాభిస్తుందని, అలాగే ఏపీలో టిడిపిలో చేరుతున్న నేతల కోసం చంద్రబాబు కోరుతున్నారని అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది. మొత్తంగా బిజెపికి పెద్దగా వచ్చే లాభం ఏం లేదని చెప్పారని సమాచారం. దీంతో మోడీతో దానిని అమిత్ షా ఆలస్యం చేయించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

బాబుకు హామీ ఇచ్చినా.. కుదరకపోవచ్చు
అమిత్ షాతో భేటీ సందర్భంగా చంద్రబాబు నియోజకవర్గాల పెంపు అంశాన్ని కూడా ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. వచ్చే నెలలో దీనిపై సమావేశం పెడదామని, అప్పుడు ఫైనలైజ్ చేద్దామని చెప్పారని తెలుస్తోంది. చంద్రబాబుకు హామీ ఇచ్చారు కానీ.. ఆ దిశలో అమిత్ షా ఆలోచన లేదని అంటున్నారు. నియోజకవర్గాలను పెంచితే మనకు లాభం ఏమిటి అని ఆయన పూర్తి వివరాలను పార్టీ నేతల నుంచి సమాచారం తీసుకున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications