ఊరికి వెళ్లే ముందు చెప్పి వెళ్లండి
ఇంకొద్ది రోజుల్లో తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి పండగ సందడి నెలకొనబోతోంది. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమౌతోన్నాయి. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం ఏర్పడనుంది. తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండుగ. కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో ఈ పండగను జరుపుకోవడానికి స్వస్థలాలకు తరలి వెళ్లడం ఆనవాయితీ.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు ఖాళీ అవుతాయి. హైదరాబాద్ నుండి అనేక కుటుంబాలు తమ స్వగ్రామాలకు వెళ్తుంటాయి. ఈ క్రమంలో వారి నివాసాలు చాలా రోజుల పాటు తాళం వేసే ఉంటాయి. ఈ పరిస్థితులు చోరీలకు అవకాశం కల్పిస్తాయని హైదరాబాద్ పోలీసులు భావిస్తోన్నారు. ఇలా ఖాళీగా వదిలి వెళ్లే నివాసాలపై నిఘా ఉంచడానికి వీలుగా, బయలుదేరి వెళ్లడానికి ముందే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా బీట్ ఆఫీసర్‌కు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఇంట్లో నగదు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను ఉంచవద్దని ఆయన గట్టిగా సూచించారు. వాటిని బ్యాంక్ లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రదేశాలలో భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సాధారణ, తేలికపాటి ముందు జాగ్రత్తలు దొంగతనాలను నివారించిగలవని ఆయన చెప్పారు. ఎటువంటి ఆందోళన లేకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకోవడానికి ఎంతగానో సహాయపడతాయని సజ్జనార్ పేర్కొన్నారు.
ఆధునిక పోలీసు వ్యవస్థ నేరాలకు స్పందించడం మాత్రమే కాదని, వాటిని నివారించడం కూడా అని సజ్జనార్ అన్నారు. పండుగల సీజన్‌లో ఇళ్ల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు హైదరాబాద్ పోలీసులు కట్టుబడి ఉన్నారని ఆయన పునరుద్ఘాటించారు. చోరీలను నివారించడానికి, ఇళ్లపై నిఘా ఉంచడానికి ప్రజల సహకారం కూడా అత్యంత అవసరమని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 100కి డయల్ చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications