వాహనదారులకు కీలక అలెర్ట్.. హైదరాబాద్ లో రేపు ఈ రూట్లలో రాకపోకలు బంద్!
తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటలో ఆగస్టు 15వ తేదీ ఉదయం 10 గంటలకు జరగనున్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన శుభ దినాన జరుగుతున్న ఈ వేడుకలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లను చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రాంతాలలో వాహన రాకపోకలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్ళింపులు
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు లను నిర్దేశించారు. హైదరాబాదులో రేపు ప్రయాణం చేయాలనుకునేవారు ఈ ట్రాఫిక్ మళ్లింపు ల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్ గూడా నుండి గోల్కొండ కోట వరకు సాధారణ వాహన రాకపోకలను నిలిపివేస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
ఇక హైదరాబాద్ తో పాటు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వద్ద కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకొని ప్రయాణాలు చేయాలని సూచించారు. గోల్కొండ కోటకు వచ్చే సందర్శకుల కోసం కూడా ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్టు తెలిపారు. పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.
ఆగస్ట్ 15కి ట్రాఫిక్ మళ్ళింపులు ఇలా
ట్రాఫిక్ మళ్లింపుల విషయానికి వస్తే సెవెన్ టూంబ్స్ నుంచి వచ్చే వాహనాలను జమాలి దర్వాజా వైపు మళ్లిస్తారు. ఇక జిహెచ్ఎంసి గ్రౌండ్, జిహెచ్ఎంసి ఐలాండ్ నుండి వచ్చే వాహనాలు మోతీ మహల్ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. బడా బజార్ నుంచి వచ్చే వాహనాలు జిహెచ్ఎంసి ఐలాండ్ వైపు మళ్ళిస్తారు. నార్సింగి, టిప్పు ఖాన్ వంతెనల నుంచి వచ్చే ట్రాఫిక్ ను రాందేవ్ గూడా జంక్షన్ వద్ద మళ్లిస్తారు.
పార్కింగ్ ఏర్పాట్లు ఇలా
ఇదే సమయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చేవారి కోసం వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు బాల హిస్సార్, బడా బజార్ మసీదు మధ్య పార్కింగ్ కు స్థలం కేటాయించారు. ఇక ప్రభుత్వ సీనియర్ అధికారులకు గోల్కొండ బస్ స్టాప్ వద్ద, ఇతర ప్రముఖులకు ఫుట్ బాల్ గ్రౌండ్ వద్ద పార్కింగ్ కేటాయించారు. మీడియా, అవార్డు గ్రహీతలు ఏరియా హాస్పిటల్ లో తమ వాహనాలను పెట్టుకునేలా ఏర్పాటు చేశారు.
వర్ష హెచ్చరికతో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త
ఇక సాధారణ ప్రజలు సెవెన్ టూంబ్స్, డెక్కన్ పార్క్, హుడా పార్క్‌లలో వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. ఇక వాతావరణ శాఖ వర్షం హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వేడుకలకు హాజరయ్యే వారు, ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications