జూబ్లీహిల్స్ లో మారుతున్న లెక్కలు.. కలిసొచ్చేదెవరికి..!!
జూబ్లీహిల్స్ బై పోల్ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికలో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే మూడు పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని సంఘాలు తమ అభ్యర్ధులను బరిలోకి దింపాలనే నిర్ణయం ఇప్పుడు పార్టీలకు సవాల్ గా మారుతోంది. టీడీపీ బరిలో లేకపోవటంతో ఎవరికి కలిసి వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే స్థానిక సమీకరణాలు స్పష్టంగా ఉన్నాయి. గెలుపు పైనా క్రమేణా క్లారిటీ వస్తోంది.
జూబ్లీహిల్స్ లో గెలుపు ఇప్పుడు అధికార కాంగ్రెస్ కు సవాల్ గా మారుతోంది. ఇక్కడ అభ్యర్ధి విషయంలో సీఎం రేవంత్ తొలి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించి.. నవీన్ యాదవ్ ను ఖరారు చేసారు. ఇదే సమయంలో ఎంఐఎం నిర్ణయం సైతం కీలకంగా మారింది. సామాజిక సమీకరణాల తో పాటుగా ప్రస్తుత పరిణామాలు తమకు అనుకూలంగా మారుతాయని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా, ముగ్గురు మంత్రులకు జూబ్లీహిల్స్ బాధ్యతలు అప్పగించారు. పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ ప్రచారంలోకి దిగారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు.

ఇక.. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఉప ఎన్నికల్లోనూ తమ స్థానాన్ని నిలటెట్టుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ హామీల విషయంలో మోసం చేసిందంటూ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బస్తీల్లో సభలు పెడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బుల్ డోజర్ వస్తుందంటూ కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ఇక.. బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ప్రచారంలో పాల్గొంటున్నారు. కిషన్ రెడ్డి ఎలాగైనా తన సన్నిహితుడైన దీపక్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ టీడీపీ పోటీ చేయటం లేదు. 2023 లో ఆ పార్టీ మద్దతుదారుల ఓటింగ్ కాంగ్రెస్ కు పోలయినట్లు విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి కలిసి వస్తాయనే అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, సర్వే నివేదికల ఆధారంగా పార్టీలు గెలుపు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications