Ganesh chaturthi: ఖైరతాబాద్ గణేష్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు.. ఒక్క అడుగుతో మొదలై..
వినాయక చవితి వచ్చేస్తోంది. ఊరు వాడా.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా గణేష్ చతుర్థికి సిద్ధం అవుతున్నారు. నగరాలు, పల్లెల్లోని గల్లీ గల్లీల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. ముంబైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏటేటా గణేష్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక ఖైరతాబాద్ గణేష్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏటా ఒక్కో రూపంలో ఇక్కడ ఏర్పాటు చేసే గణేశుడ్ని మనసారా కొలిచేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తుంటారు. అంతటి మహిమాన్వితమైన గణేష్ గా ఎన్నో ఏళ్ల నుంచి ఖ్యాతి పొందింది ఖైరతాబాద్ గణేష్. మరి ఖైరతాబాద్ గణేష్ చరిత్రను తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది.
హైదరాబాదులోని ఖైరతాబాద్ లో ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా 11రోజులపాటు జరిగే ఖైరతాబాదు గణేష్ ఉత్సవ మేళాలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. 11వ రోజు హుస్సేన్ సాగర్ లో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకెళ్లి ఖైరతాబాదు గణేష్ ను నిమజ్జనం చేస్తారు. ఇక్కడ గణేష్ నవరాత్రులు ఓ వేడుకలా నిర్వహిస్తారు.
ఇక ఈ ఏడాది అంటే 2025 లో 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వ శాంతి మహాశక్తి గణపతిగా వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. స్వామి వారికి ఇరువైపులా కుడి పక్కన శ్రీజగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి వారు.. ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి ఉండేలా విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. అలాగే గణేష్ విగ్రహం 3 తలలతో నిల్చున్న భంగిమలో ఉంటుంది. తలపై పడగవిప్పిన 5 సర్పాలు, మొత్తం 8 చేతులు ఉంటాయి. కుడివైపు చేతుల్లో పైనుంచి ఆయుధం, సుదర్శన చక్రం, అభయహస్తం, రుద్రాక్షమాల ఉంటుంది.
అయితే ఖైరతాబాద్ గణేశుడికి ఏకంగా 70 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆనాటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత ప్రజలందర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు మహారాష్ట్రకు చెందిన ఆ నాటి స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర తిలక్.. గణేష్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలను ముంబైలో ప్రారంభించారు. ఈ ఉత్సవాలతో ప్రజలను ఏకం చేసి అంతరిస్తున్న హిందూ సంప్రదాయాలను రక్షించి దేశభక్తిని పెంపొందిచాలని ఆయన సంకల్పించారు.

అయితే తిలక్ స్ఫూర్తితో 1954లో ఖైరతాబాద్ కౌన్సిలర్ గా ఉన్న సింగరి శంకరయ్య ఈ గణేశ్ ఉత్సవాలను ప్రారంభించారు. అలా 1954లో ఒక్క అడుగు ఎత్తుతో విగ్రహం తయారు చేశారు. అలా 60ఏళ్ల పాటు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెంచుతూ వచ్చారు. ఆ తర్వాత 2014 నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది నిలబెట్టే వినాయకుడి విగ్రహం 69 అడుగులు ఉంటుంది. ఇక ప్రతి ఏటా ఖైరతాబాద్ గణేష్ కోసం భారీ లడ్డూను చేయిస్తారు. 2021 వరకు తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి లడ్డూను తీసుకొచ్చేవాళ్లు. ఖైరతాబాద్ గణేష్ లడ్డూ అనేక సార్లు గిన్నిస్ బుక్ లోనూ చోటు దక్కించుకుంది. కానీ ఆ తర్వాత నుంచి స్థానికంగానే లడ్డూ తయారు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications