అభిమానముంటే అంతే: ఖానాపూర్ ఇకపై కవితాపూర్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామం పేరును ఎంపీ కవిత పేరిట కవితాపూర్‌గా మారుస్తూ గ్రామ పంచాయతీ, గ్రామ ప్రజలు, గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కల్వకుంట్ల కవితపై ఆ గ్రామ ప్రజలకు ఎనలేని అభిమానం. అందుకే ఆ గ్రామస్తులంతా ఏకమై తమ గ్రామానికి ఆమె పేరు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక ముందు తమ గ్రామం పేరుగా ఆమెపేరు ఉండాలని నిశ్చయించుకున్నారు. ఇంకేముందు ఆ గ్రామం పేరు ఇక మారుపోనుంది.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామం పేరును ఎంపీ కవిత పేరిట కవితాపూర్‌గా మారుస్తూ గ్రామ పంచాయతీ, గ్రామ ప్రజలు, గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4వ తేదీన పేరు మార్పిడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచి పెంబర్తి మమత, ఉపసర్పంచి ఉమ్మెడ నర్సయ్య, ఎంపీటీసీ బాక లక్ష్మి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ మేరకు ఆదివారం గ్రామస్తులు హైదరాబాద్‌కు తరలివెళ్లి ఎంపీ కవితను కలిశారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి గ్రామ పేరు మార్పు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. వచ్చేనెల 4వ తేదీన గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాలని ఎంపీ కవితను కోరారు. తమది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామమని, తాము ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూసినా ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రామంలో 274 ఇళ్ల స్థలాలను ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. గత కాంగ్రెస్ హయాంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని వారి చుట్టూ తిప్పుకున్నారని వాపోయారు. టీఆర్‌ఎస్ ప్రభు త్వం ఏర్పాటయ్యాక ముంపు గ్రామస్తులందరికీ ఇళ్ల పట్టాలు వచ్చాయని ఎంపీతో చెప్పారు. అందుకే గ్రామస్తులందరం కలిసి నూతనంగా 274 ఇళ్ల స్థలాల గ్రామానికి కవితాపూర్‌గా పెట్టుకునేందుకు నిర్ణయించుకున్నామన్నారు.












Click it and Unblock the Notifications