ఢిల్లీలో ఆ వర్గం బీజేపీతోనే.. తెలంగాణలోనూ..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలో వస్తోందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుందన్నారు.
ఢిల్లీ ఓటర్లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన విజయాన్ని ఢిల్లీ ప్రజలు ఇచ్చారన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు. కర్ణాటక, తెలంగాణలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.

తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. బీసీలకు కాంగ్రెస్ సర్కారు తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. బీసీల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
మరోవైపు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారన్నారు.అవినీతి,కుంభకోణాలు,జైలు పార్టీలు వద్దనుకున్నారని చెప్పారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచీ ఊహించిందేనని బండి సంజయ్ అన్నారు.
మేధావి వర్గమంతా బీజేపీకే ఓటు వేశారన్నారు బండి సంజయ్. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్ఠానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలోని మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ ఒక్కటేనన్నారు బండి సంజయ్.
కాగా, శనివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలుండగా 48 స్థానాల్లో బీజేపీ విజయధుందుభి మోగించింది. ఇక, అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక్క సీటు కూడా దక్కకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications