ఖమ్మంలో కిషన్ రెడ్డి అరెస్ట్, ఉద్రిక్తత: హరీశ్ రావుకు సవాల్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షనేత కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో మిర్చికి మద్దతు ధర కోసం గతవారం రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
ఖమ్మం: తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షనేత కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో మిర్చికి మద్దతు ధర కోసం గతవారం రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు సంఘీ భావం తెలిపి, వారి సమస్యలను తెలుసుకునేందుకు కిషన్ రెడ్డి ఖమ్మం మార్కెట్ యార్డుకు బయల్దేరారు.
అయితే మార్కెట్ యార్డు పరిసరాల్లో ఉన్న పోలీసులు, ఆయనను అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని ఆయన పోలీసులను నిలదీశారు. కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కిషన్ అరెస్టుతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కేసీఆర్ సర్కారువి అబద్ధాలే
ఖమ్మంలో అరెస్టైన అనంతరం ఆయన మాట్లాడుతూ.., దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కేంద్రం మిర్చికి మద్దతు ధర ప్రకటించిందని తెలంగాణ బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి తెలిపారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం రైతులకు అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు.

సొంత అవసరాలకు వాడుకున్న టీఆర్ఎస్..
కేంద్రం 7,900 కోట్ల రూపాయలు ఇస్తే..వాటిని సొంత అవసరాలకు వాడుకున్న టీఆర్ఎస్ నేతలు రైతుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని అన్నారు. మార్కెట్ యార్డులో దాడులు చేసింది రైతులు కాదని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే రైతులను మాత్రం అరెస్టు చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

అందుకే దాడి చేశారు..
ఖమ్మం మార్కెట్ యార్డులో ఈనాం కార్యాలయంపై మార్కెట్ యార్డు వ్యాపారులు దాడులు చేశారని అన్నారు. ఈ కొత్త విధానం వల్ల ఇతర ప్రాంతాల్లో తాము విక్రయిస్తున్న పంట ధర తెలిసిపోతుండడంతో వ్యాపారులు రైతులను మోసం చేయడానికి కుదరడం లేదని, అందుకే ఆ కార్యాలయంపై దాడి చేశారని కిషన్ రెడ్డి అన్నారు.

హరీశ్‌కు సవాల్
రైతులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మిర్చికి కేంద్రం నిధులు, మద్దతు ధరపై బహిరంగ చర్చకు ఖమ్మం మార్కెట్ యార్డులో సిద్ధంగా ఉంటానని, హరీష్ రావుకు ఆ దమ్ముందా? అని ఆయన సవాలు విసిరారు. కేంద్రం మిర్చికి రూ.5వేల మద్దతు ప్రకటించడంపై హరీశ్ రావు గురువారం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రైతుల సమస్యలను అర్థం చేసుకోవడం కేంద్రం విఫలమైందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications