'రాజాసింగ్ వెనుక ఎవరో కాలమే నిర్ణయిస్తుంది': కిషన్ రెడ్డి తర్వాత ఎవరు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయమై పార్టీ మంగళవారం స్పందించింది. కిషన్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని ఖండించింది. రాజాసింగ్ వెనుక ఎవరున్నారో కాలమే నిర్ణయిస్తుందన్నారు.
బిజెపిలో ఢీలా!
బిజెపిలో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయి. పార్టీలో చింతల రామచంద్రా రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, డాక్టర్ కె లక్ష్మణ్, నాగం జనార్దన్ రెడ్డివంటి సీనియర్లకు కిషన్ రెడ్డి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేకించి గోషామహల్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సోదరుడు మధుగౌడ్‌ను పార్టీలోకి చేర్చుకోవటాన్ని రాజాసింగ్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరిపైనైతే పోరాడామో వారినే పార్టీలోకి తీసుకోవడమేమిటనేది ఆయన ప్రశ్నిస్తున్నారు.

పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా జిల్లాలను వదిలేసి పూర్తిగా తన నియోజకవర్గం అంబర్‌పేటకే పరిమితమయ్యారనే విమర్శ చాలాకాలంగా ఉంది. దీనికితోడు డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రా రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరుల బలమంతా నగరానికే పరిమితం.
ఈ స్థితిలో పార్టీ నాయకులు రెండుగా చీలి కొట్లాడుకుంటూ బజారుకెక్కుతున్న తీరు నగరంలోని పార్టీ శ్రేణులను అంతులేని అయోమయంలోకి నెట్టేస్తోంది. జిల్లాల్లోనూ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. పైగా ఇటీవల మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడారు.
ఆయన శిబిరం ముఖ్యనాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా ఎంతోకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరదూరంగానే ఉంటున్నారు. త్వరలోనే ఆయన కూడా రాజీనామా చేస్తారంటున్నారు. మొన్నటి వరంగల్ ఉప ఎన్నికలో టీడీపీ ఓట్లు కలిసినప్పటికీ కనీసం డిపాజిట్ దక్కకపోవడం పార్టీ శ్రేణులను కంగుతినిపించింది.
కిషన్‌రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా కొంతకాలంగా లక్ష్మణ్, రాజాసింగ్ తదితరులు అసలు పార్టీ ఆఫీసు ముఖమే చూడటం లేదని తెలుస్తోంది. దత్తాత్రేయ కూడా అంతంతమాత్రమే. ఇంద్రసేనా రెడ్డి, బద్దం బాల్ రెడ్డి, విద్యాసాగర రావు, రాజేశ్వర్ రావు వంటి సీనియర్లు సైతం ఈ కొట్లాటలను చూస్తూ రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారంటున్నారు.
ఎలాగూ తన అధ్యక్ష పదవీకాలం పూర్తయిపోతున్నదనీ, ఇప్పటికే రెండుసార్లు ఆ పదవీ బాధ్యతలు మోసినందున ఇక పార్టీ నియమావళి ప్రకారం మరోసారి అవకాశమేమీ ఉండదనేది కిషన్ రెడ్డి నిర్లిప్తతకు కారణంగా చెబుతున్నారు.
సీనియర్ల సహాయనిరాకరణతో తానేం చేయగలననీ ఆయన ఇప్పటికే జాతీయ నాయకులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు, కిషన్ రెడ్డి స్థానంలో అధ్యక్షులుగా ఎవరిని ఎంపిక చేసుకోవాలో కూడా జాతీయ పార్టీకి అంతుపట్టడం లేదు. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వంటి నేతలున్నా రాష్ట్ర బాధ్యతలకు విముఖంగా ఉన్నారు.
రాజాసింగ్ పైన కేసు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివెల్ అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications