కేటీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్: ప్రతిపక్షాలకు అభ్యర్ధులే లేరని నాయిని ఎద్దేవా
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీపై చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఆంధ్రావారిని పొగుడుతున్నారని ఆయన ఆరోపించారు.
కేటీఆర్ ఏ వేదిక మీద నుంచి సవాల్ విసిరారో, అదే వేదిక మీద నుంచి సమాధానం చెబుతామని ఆయన సవాల్ విసిరారు. నిన్నటి వరకు సీమాంధ్రులను రాక్షసులు, కుక్కలతో పోల్చిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఓట్లకోసమే వారిని పొగుడుతున్నారన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం: నాయిని
నగరంలోని అడిక్‌మెట్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయడానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేశారు. ఓటింగ్ శాతం పెంచే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమం సమయంలో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో నీటి కొరత తీర్చేందుకు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డిపాజిట్లు కూడా దక్కవు: మంత్రి పోచారం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి పోచారం తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ప్రజలను కంటిరెప్పలా కాపాడుకుంటున్నామని వెల్లడించారు. గత 60 ఏళ్ల పాలనకు నగరంలో సమస్యలు నిదర్శనమన్నారు.
18 నెలల కాలంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. త్వరలోనే నగరంలో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామన్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు నగర శివార్లలో రెండు రిజర్వాయిర్లు నిర్మిస్తున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు స్కైవేలు నిర్మిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications