కిషన్ రెడ్డి అన్ హ్యాపీ: కేంద్ర మంత్రివర్గ భేటీకి డుమ్మా- ఫోన్ స్విచాఫ్: క్లారిటీ ఏంటీ?
హైదరాబాద్/న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ కార్యవర్గాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణల్లో పార్టీలో సంస్థాగత మార్పులను చేపట్టింది బీజేపీ అధిష్ఠానం. రెండు చోట్లా పార్టీ అధ్యక్షులను తొలగించింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి- ఏపీలో పార్టీ పగ్గాలను కేంద్ర మాజీమంత్రి డీ పురంధేశ్వరికి అప్పగించింది.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతోండటం, ఏపీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక పోరును దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్ఠానం- సంస్థాగత మార్పులను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ పార్టీ రాష్ట్ర శాఖ కార్యవర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయబోతోంది. కొత్త ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు రాబోతోన్నారు.

ఈ నియామకాలు చోటు చేసుకున్న తరువాత- కిషన్ రెడ్డి పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తనకు తెలంగాణ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చెబుతున్నారు. ఇవ్వాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికీ డుమ్మా కొట్టారని తెలుస్తోంది.

బీజేపీ పెద్దలెవరికీ ఆయన అందుబాటులో లేకుండా పోయారనే ప్రచారం హస్తినలో జోరుగా సాగుతోంది. ఆయన మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్‌లో ఉన్నట్లు జాతీయ మీడియా చెబుతోంది. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనగా.. తనకు పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలను అప్పగించడం సబబు కాదనే అభిప్రాయంలో కిషన్ రెడ్డి ఉన్నారని అంటోన్నారు.
ఫలితాలు గనక ప్రతికూలంగా వెలువడితే దానికి తానే బాధ్యత వహించాల్సి ఉంటుందనే ఆందోళన ఆయనలో వ్యక్తమౌతోందని సన్నిహితులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కిషన్ రెడ్డి- దేశ రాజధానిలోనే ఉన్నప్పటికీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.
జాతీయ మీడియాలో వచ్చిన ఈ కథనాలపై కిషన్ రెడ్డి స్పందించారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడారు. ఈ వార్తలను తోసిపుచ్చారు. తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం చూపిన బాటలో సాగుతానని అన్నారు.
జులై 8వ తేదీన వరంగల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ, సమావేశాన్ని ఏర్పాటు చేశారని, దీని తరువాత తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరిస్తానని కిషన్ రెడ్డి వివరించారు. కేంద్ర మంత్రిగా తన స్థానానికి సంబంధించినంత వరకు, పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటే దాన్ని శిరసావహిస్తానని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications