ఢిల్లీలో పరువుతీసి.. కొత్త డ్రామాలు: కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్, కవిత.. కేంద్రం, ప్రధాని మోడీపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్, కవిత.. కేంద్రం, ప్రధాని మోడీపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ కేసులో ఈడీ ఎవరిని ప్రశ్నిస్తుందో బీజేపీకి సంబంధం లేదన్నారు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేసే అవసరం, సమయం కూడా తమ పార్టీకి లేదన్నారు. కేంద్రంపై మంత్రి కేటీఆర్, కవిత అన్ని అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు.

వాళ్లు నోరు తెరిస్తే అబద్ధాలంటూ కిషన్ రెడ్డి ఫైర్
కల్వకుంట్ల కుటుంబం నోరు తెరిస్తే అబద్దాలు.. నిజం మాట్లాడమే తెలియదు వాళ్లకు.. వాళ్లకు వాళ్లు గొప్పోళ్లుగా ఊహించుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి. లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నాయకులు కొత్త నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. కల్వకుంట్ల కుటుంబంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకే నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అక్రమ వ్యాపారానికి, తెలంగాణ సమాజానికి ఎందుకు లింక్ పెడుతున్నారని ప్రశ్నించారు.

ఢిల్లీలో పరువు తీసి..: ఫోన్లు పగలగొట్టిందెవరన్న కిషన్
కవిత లిక్కర్ వ్యాపారం తెలంగాణ కోసం, మహిళల కోసం చేశారని అని కిషన్ రెడ్డి నిలదీశారు. ఢిల్లీలో అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ పరువును ఢిల్లీలో తీశారని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. లిక్కర్ కుంభకోణంలో ఒక మహిళ ఉండటం తానెప్పుడూ చూడలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ టార్గెట్ చేస్తున్నారని.. అన్నాచెల్లెళ్లు అనడం విడ్డూరంగా ఉందన్నారు. మీకు మీరుగా లిక్కర్ కేసులో ఇరుక్కుని బీజేపీపై అభాండాలు వేస్తు్నారని.. ఫోన్లు పగలగొట్టింది ఎవరు? అని మండిపడ్డారు. ప్రత్యేక విమానాల్లో ఎవరు ఢిల్లీకి వెళ్లారని నిలదీశారు.

ఈడీ నోటీసులతో మహిళా రిజర్వేషన్లు గుర్తొచ్చాయా?: కిషన్ రెడ్డి
ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం కవిత చేయనున్న దీక్షపైనా కిషన్ రెడ్డి స్పందించారు. మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదన్నారు. మొదటి ఐదేళ్లలో ఒక్క మహిళా మంత్రి కూడా లేకుండా పాలన చేసిన పార్టీ.. మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. మహిళల రిజర్వేషన్ల కోసం మిత్రులైన ఎంఐఎం, సమాజ్‌వాదీ పార్టీలను ఒప్పిస్తారా? అని నిలదీశారు. ఈడీ నోటీసులు రాగానే మహిళా రిజర్వేషన్లు గుర్తుకు వచ్చాయా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త నాటకాలాడుతున్నారన్నారు. సానుభూతి కోసం కల్వకుంట్ల కుటుంబం డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. మహిళలను రాష్ట్రపతిగా, ఆర్థికశాఖ మంత్రిగా చేసిన పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియా స్వేచ్ఛను హరిస్తున్నది ఎవరో అందరికీ తెలుసని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications