కేసీఆర్ పరువు తీసుకుంటున్నారు!: కల్వకుంట్ల ఫ్యామిలీని ఎవరూ కాపాడలేరన్న కిషన్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ సంపదను బీహార్‌కు దోచిపెడుతున్నారిన విమర్శించిన కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకుని బీహార్ రాష్ట్రంలో పర్యటించారో సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Recommended Video

దేశానికి కల్వకుంట్ల కుటుంబమే దిక్కని గొప్పలు, కానీ.: కిషన్ ఫైర్
ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ కేంద్రంపై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశానికి కల్వకుంట్ల కుటుంబమే దిక్కని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రచారం చేసినా ఏ ఒక్క రాష్ట్రం కూడా పట్టించుకోవట్లేదని అన్నారు. ఆయన వ్యవహరించిన తీరు చూసి నవ్వుకుంటున్నారన్నారు.

కేసీఆర్ ప్రాధేయపడ్డా.. అంటూ కిషన్ రెడ్డి సెటైర్లు
బుధవారంనాటి భేటీలో ఇద్దరు నాయకులు కలిసి కూర్చోలేని పరిస్థితి ఉందని.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ లేచి వెళ్తుంటే కూర్చోమని కేసీఆర్ ప్రాధేయపడ్డారని ఎద్దేవా చేశారు. దీంతో కేసీఆర్ పరువు పోయిందన్నారు. ఇక నాయకులందరినీ కేసీఆర్ ఏ విధంగా ఏకం చేస్తారో తెలియట్లేదన్నారు. తెలంగాణ పూర్తి అభివృద్ధి చెందినట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.కేసీఆర్ నియంతృత్వ పాలన దేశమంతా అమలు చేస్తారా? అని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో 15 శాఖలున్నాయని, ఆ కుటుంబం మారితేనే తెలంగాణ బాగుపడుతుందన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ప్రగతిభవన్‌లోనే ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ సహా కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ రక్షించలేరని అన్నారు.

ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ బీహార్ వెళ్లారంటూ కిషన్ రెడ్డి నిప్పులు
సమస్యలు చెప్పుకునేందుకు సీఎం అందుబాటులో ఉండరని, నెలలో 15 రోజులు ఫాంహౌస్‌లో ఉండటమే తెలంగాణ మోడలా? అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో మత కలహాలు తగ్గాయన్నారు. కేసీఆర్ తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో బీహార్ గురించి కేసీఆర్ విమర్శలు చేశారని.. ఇప్పుడేమో తెలంగాణ సంపదను బీహార్ కు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బీహార్ లో పర్యటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మేకిన్ ఇండియాకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని, వైద్య పరికరాల దిగుమతి తగ్గించి ఎగుమతికి కృషి చేస్తున్నామన్నారు. బొమ్మల దిగుమతి తగ్గించి దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

అందుకు ప్రజలే కేసీఆర్ తగిన బుద్ధి చెప్తారంటూ కిషన్
మోడీది నీతివంతమైన పాలన అని సీఎం కేసీఆర్ గజ్వేల్లో పొగిడారని.. అయితే హూజూరాబాద్‌లో గెలవగానే అది అవినీతి పాలన అయ్యిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ లాంటి వాళ్లకు బీజేపీ భయపడదని..మోడీ పాలనలో దేశంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు. తమ సమస్యలు తీర్చే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు వారే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధమేనని కిషన్ రెడ్డి అన్నారు. హామీల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న కేసీఆర్.. గత 8 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టారని నిలదీశారు. హిందూ దేవుళ్లను కించపరిచిన మునావర్ షో లను అనేక రాష్ట్రాలు నిషేధిస్తే.. కేసీఆర్ సర్కార్ మాత్రం రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం సిగ్గుచేటన్నారు.












Click it and Unblock the Notifications