ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: ప్రెస్‌మీట్‌లో కిషన్ రెడ్డి, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌తో కలిసి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.కుటుంబపాలన, అవినీతి నిర్మూలనే భారతీయ జనతా పార్టీ లక్ష్యమన్నారు.
బీజేపీ రెండు ప్రధాన అంశాలపై పోరాటం చేస్తోందని తెలిపారు. అందులో ఒకటి కుటుంబ పాలన, రెండోది అవినీతి అని అన్నారు. ఈ రెండు విషయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఎర్రకోట నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని భారత ప్రజల ముందు పెట్టారని తెలిపారు.

ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో నయా నిజాం తరహాలో పాలన సాగుతోందన్నారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగడం లేదన్నారు. నిరంకుశ పాలనకు పాతరేయాలని ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఫాంహౌస్‌కు పరిమితం చేయాలన్నారు కిషన్ రెడ్డి.
ఎస్సీలకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ సీఎం అయ్యారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గిరిజన బంధు అమలు ఏమైందో కేసీఆర్ చెప్పాలన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకూ అతీగతీ లేదన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ఆస్పత్రులు నిర్మిస్తామని హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు రూ. లక్ష రుణమాఫీ ఏమైందో కేసీఆర్ చెప్పాలన్నారు. పార్టీ కార్యాలయాలకు భూములు ఇస్తున్నారు కానీ.. పేదలకు ఇచ్చేందుకు మాత్రం భూములు లేవా? అని ప్రశ్నించారు. కేంద్రం సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తామంటే భూమి ఇవ్వట్లేదని కిషన్ రెడ్డి తెలిపారు.
ఫలక్‌నుమా వరకు నడవాల్సిన మెట్రో.. ఎంజీబీఎస్ వద్దే ఆగిందని.. పాతబస్తీకి మెట్రో లైన్ ఎందుకు నిర్మించట్లేదో కేసీఆర్ చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. మరోవైపు, గత కొద్ది రోజులుగా తమపై సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో పొత్తులు, పెట్టుకుది, ఒప్పందాలు కుదుర్చుకుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్రంలో అధికారం పంచుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనని.. ఈ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి బొమ్మాబొరుసు లాంటివన్నారు. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచినవారు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారన్నారు. తాము ఏనాడూ కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో కలవలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉండటమే తమ ధ్యేయమని అన్నారు.
Live: Press Meet, City Office, Barkatpura, Hyderabad. https://t.co/IEEcYHVkEi
— G Kishan Reddy (@kishanreddybjp) July 6, 2023
ఆ తర్వాత బండి సంజయ్ మాట్లాడుతూ.. కిషన్ రెడ్డితో తనకు చాలా కాలం నుంచి మంచి అనుబంధం ఉందని చెప్పారు. ఎన్నో కార్యక్రమాలను ఆయనతో కలిసి నిర్వహించినట్లు తెలిపారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నేతలమంతా కలిసి పనిచేస్తామని చెప్పారు. సందెట్లో సడేమియా అన్నట్లు కొందరు బీజేపీతోపాటు తనపై, కిషన్ రెడ్డిపై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బండి సంజయ్ అన్న గారికి
— BJP IT Cell Telangana (@BJPITCellTS) July 6, 2023
ఆత్మీయ స్వాగతం...#bandisanjay pic.twitter.com/6ifwcSXkkG
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు చేస్తున్న అలాంటి ప్రచారాలను బీజేపీ శ్రేణులు పట్టించుకోవదని బండి సంజయ్ సూచించారు. జులై 8న వరంగల్‌లో ప్రధాని మోడీ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా భారీగా ఎత్తున తరలిరావాలన్నారు. కాగా, అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న బండి సంజయ్‌కి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications