గ్రూప్-1 నోటిఫికేషన్ ఎక్కడ?: కాంగ్రెస్ సర్కారుపై కిషన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర పదాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ యాత్రలు, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల సమ్మేళనం, మహిళా స్వయం సహాయక సంఘాల సమ్మేళనాలు, యువ సమ్మేళనాలు, అయోధ్య దర్శన్, వికసిత భారత్ సంకల్ప అంబాసిడర్ కార్యక్రమాలపై చర్చించారు. గ్రామస్థాయిలో నిత్యం కొత్తగా చేరికలు ప్రోత్సహించాలని తెలిపారు.
వేగంగా రాజకీయ సమీకరణలు మారనున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. చేరికలు అంటే ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లే కాదని.. సామాజిక సేవా కార్యక్రమాలు చేసే వాళ్లను పార్టీలో చేర్చుకోవాలని తెలిపారు. మండలం, అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాజకీయలతో సంబంధం లేకుండా అనేక రంగాలకు చెందిన ప్రముఖులను పార్టీలో చేర్చుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌లో కొత్త రక్తాన్ని చేర్పించాలని, ఫిబ్రవరి నెల మొత్తం చేరికలపై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు.

ప్రజలను మోసం చేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల వాగ్దానంలో ఫిబ్రవరి 1న నిరుద్యోగ యువత కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందని గుర్తు చేశారు. చెప్పిన సమయం దాటిపోయిందని, ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదన్నారు.
హామీలు ఇచ్చి మోసం చేసే ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని విమర్శించారు. నమ్మి ఓటేసిన తెలంగాణ యువతను నిట్టనిలువునా మోసం చేసిందని ఆరోపించారు. యువతను మోసం చేసినట్లే, ఇతర వాగ్దానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. అట్టహాసంగా పత్రికా ప్రకటనలు ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదని.. బీఆర్ఎస్ పార్టీనే ఓడిపోయిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి గురించి రేవంత్ మాట్లాడారని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారని, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంత మాత్రాన పాలనలో తేడా ఉంటుందని తాను అనుకోవడం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications