భూ దోపిడీకి చట్టబద్దతా?, భయభ్రాంతులకు గురిచేస్తారా?: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం తన మౌనదీక్ష విరమించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణాల కోసమంటూ భూసేకరణ చట్టం 2013కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన సవరణ చట్టంతో దోపిడీకి చట్టబద్ధత కల్పించినట్లవుతుందని ఆయన మండిపడ్డారు.
వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు. కొత్తగా శాసనసభలో ఆమోదం పొందిన బిల్లుతో నిర్వాసితులకు అన్యాయమే తప్ప న్యాయం దక్కదని అన్నారు. సీఎం, మంత్రులు, అధికారులు చెబుతున్నట్లు భూసేకరణ చట్టం- 2013 లోపభూయిష్టమేమీ కాదని అన్నారు.
గడిచిన ఏళ్లలో ఎంతోమంది నిర్వాసితులకు ఈ చట్టం ద్వారా న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. అలాంటి చట్టాన్ని కాదని సవరణ చట్టంతో దోపిడీని చట్టబద్ధం చేశారని కోదండరాం ధ్వజమెత్తారు. నష్ట పరిహారం భారీగా ఇస్తున్నామంటున్న ప్రభుత్వం డబ్బుల లెక్కలు చెప్పుకోవడమే గానీ, ప్రజల బతుకుదెరువు గురించి పట్టించుకోవడం లేదని అన్నారు.

కిందపడేసి తొక్కేసైనా భూములు లాక్కుంటామన్న మంత్రుల మాటలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయని కోదండరాం అన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రజలు దిక్కుతోచని వారయ్యారని, అందుకే జేఏసీ వారికి అండగా ముందుకొచ్చిందని తెలిపారు. ఇందులో ప్రజలకు మేలు చేయాలన్న తాపత్రయమే తప్ప రాజకీయాలు లేవని కోదండరాం స్పష్టం చేశారు.
మల్లన్నసాగర్ సహా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టుల కింద నిర్వాసితులవుతోన్న ప్రజల గొంతును రాజధానిలో వినిపించేందుకు ధర్నా కార్యక్రమం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు అనుమతివ్వడం లేదో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం అణిచివేత దోరణికి పాల్పడుతోందని అన్నారు. అధికార పార్టీ హుందాగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజల బాధలను చెబితే ఏకపక్షంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని అన్నారు. భూనిర్వాసితులకు న్యాయం చేయాలంటూ, అరెస్ట్ చేసిన జేఏసీ నేతలను వెంటనే విడుదల చేయాలంటూ కోదండరాం మౌనదీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది.












Click it and Unblock the Notifications