కెసిఆర్! హామీ మర్చిపోయారా?: ఉద్యమం తప్పదని కోదండరాం
నిజామాబాద్: అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించారని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొందని గుర్తుచేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు.
అనంతరం కోదండరాం మాట్లాడుతూ .. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్స్ కర్మాగారాలను ప్రభుత్వం వెంటనే తెరిపించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నిజాంసుగర్స్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇంతకాలం పాటు వేచిచూసే ధోరణిని అవలంభించామని, అయితే సమస్య పరిష్కారానికి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవడం అనివార్యమనే పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.
అన్ని రాజకీయ పక్షాలు, అన్ని వర్గాల వారిని ఏకం చేసి ఐక్య ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రత్యేక రాష్ట్రం కోసం కొనసాగిన తెలంగాణ ఉద్యమం తరహాలో నిజాం షుగర్స్ కార్యాచరణ ఉంటుందని, డిమాండ్ల సాధన కోసం సుదీర్ఘ పోరాటానికి సిద్ధమయ్యామని కోదండరాం స్పష్టం చేశారు.

ముందుగా భావ వ్యాప్తి కోసం నిజాంసుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ గ్రామ గ్రామాన కరపత్రాలు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని, ధూంధాంలు, గ్రామ సభలు, సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలను చేపడతామని అన్నారు. అనంతరం రెండు దశల్లో పాదయాత్ర నిర్వహించాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.
మొదటి దశగా బోధన్ నుండి నిజామాబాద్ వరకు పాదయాత్ర జరుపుతామని, అనంతరం నిజామాబాద్ నుండి హైదరాబాద్ వరకు రెండో విడత పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. నిజామాబాద్‌తో పాటు నిజాంసుగర్స్ ఫ్యాక్టరీలు ఉన్న కరీంనగర్, మెదక్ జిల్లాలలోనూ ఏకకాలంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేలా అన్ని వర్గాల వారిని సన్నద్ధం చేస్తామన్నారు. కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి తెరిచేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications