కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్; ఢీల్లీకి రేవంత్, ఉత్తమ్, జానారెడ్డిలు; ఢిల్లీపెద్దలకు చర్చలపై రిపోర్ట్!!
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం సీరియల్ ఎపిసోడ్ లా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా? లేకా బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారా? అన్న క్లారిటీ ఇంకా రాలేదు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటం పక్కా అన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతుంది.

రాజగోపాల్ రెడ్డితో చర్చల సారాంశాన్ని ఢిల్లీ పెద్దలకు వివరించనున్న కాంగ్రెస్ నేతలు
ఇటీవల కాలంలో పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు విషయంలో ఏం చెయ్యబోతున్నారు? తాము ఏం స్టెప్ తీసుకోవాలి అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతుంది. రాజగోపాల్ రెడ్డి తో మంతనాలు జరుపుతున్నా, ఎలాంటి క్లారిటీ లేక కాంగ్రెస్ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఇక ముఖ్య నాయకులు అనేక మార్లు ఇప్పటికే చర్చలు జరిపి, ఆయనను అనునయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తో జరిగిన చర్చల సారాంశాన్ని సోమవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి, జానారెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ అధినాయకత్వానికి వివరించనున్నారు.

కోమటిరెడ్డి బ్రదర్ విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు
చర్చల కోసం ఢిల్లీకి రావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏఐసీసీ దూతల ఆహ్వానం వచ్చినప్పటికీ ఆయన చర్చలకు వెళ్లడానికి నిరాకరించినట్లుగా తెలుస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని, ఆయనను పార్టీలోనే కొనసాగేలా చూడాలని పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతుంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి తీరని నష్టం చేస్తున్నారని ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని మరొక వర్గం అభిప్రాయపడుతుంది.

రెండుగా చీలిన కాంగ్రెస్ నేతలు .. ఎవరి వాదన వారిదే.. అధిష్టానం సూచనలు
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండుగా చీలిపోయారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక క్రమశిక్షణా చర్యలు తీసుకోమని చెప్పే వర్గం ఒకటైతే, తొందరపడొద్దు అని చెప్పే వర్గం మరొకటి కావటంతో, కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారంలో ఆచి తూచి వ్యవహరిస్తుంది. ఇక ఒకపక్క ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే, క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకులు ఎవరూ ఆయనతో వెళ్ళకుండా తగిన చర్యలు తీసుకోవాలని, స్థానిక నాయకులతో మాట్లాడాలని అధినాయకత్వం నల్గొండ జిల్లా పార్టీ నాయకులకు చెప్తుంది.

కేసి వేణుగోపాల్ తో సాయంత్రం భేటీ .. కోమటిరెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ ముఖ్య నేతల రిపోర్ట్
ఇక ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై, అలాగే తాజాగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై జాతీయ నాయకుడు కేసి వేణుగోపాల్ తో చర్చించనున్నారు. ఈమేరకు కేసీ వేణుగోపాల్ తో భేటీ అవడానికి టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు.












Click it and Unblock the Notifications