మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఎమ్మెల్సీ కవితపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ బిల్లుపై నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కు, ప్రధాని మోడీ కి ధన్యవాదాలు తెలుపుతూ కవిత ట్వీట్ చేశారు. ఇటీవల మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ కి లేఖ రాశారని, ఈ నిర్ణయం వెనుక బీఆర్ఎస్ కృషి చాలా ఉందని ఆమె పేర్కొన్నారు.
బలమైన పార్టీలు డిమాండ్ చేయడం వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్న కవిత మహిళా బిల్లుకు బి ఆర్ ఎస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇదంతా తాము సాధించిన విజయంగా చెప్పుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద మహిళలు కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కెసిఆర్ తోనే కేంద్రంలో చలనం వచ్చిందని, మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

తాను మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేశానని, ఎట్టకేలకు కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో ఆమెను టార్గెట్ చేశారు.
తెలంగాణ ప్రకటించినప్పుడు కెసిఆర్ పార్లమెంట్లో లేరని, మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తున్నప్పుడు కవిత ఎంపీ కాదని అయినా ఆ ఘనత మీదే అన్నట్టు చెప్పుకోవాలని చూడడం హాస్యాస్పదం అంటూ సోషల్ మీడియా వేదికగా కవితను టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించడం వెనుక, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం వెనుక కెసిఆర్ ఉన్నాడని చెప్పుకుంటున్నారని, మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక కూడా తామే ఉన్నామని చెప్పుకుంటున్నారన్నారు.
పార్లమెంట్లో స్థానమే లేకుండా కవిత, కెసిఆర్ ఈ విధంగా చెప్పుకోవడం హాస్యాస్పదం అంటూ ఆయన టార్గెట్ చేశారు. వారి వల్ల తెలంగాణ రాలేదని, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వారి వల్ల కావడం లేదని చెప్పే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.












Click it and Unblock the Notifications