రూ. 18 లక్షల కోట్ల కుంభకోణం: కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్, సీబీఐ విచారణకు డిమాండ్
నల్గొండ: టీఆర్ఎస్ సర్కారుపై మునుగోడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సామాన్యుల నుంచి భూములు లాక్కోవాలని పథకం ప్రకారమే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారని మండిపడ్డారు.

18 లక్షల ఎకరాల అతిపెద్ద స్కామ్ అంటూ రాజగోపాల్ రెడ్డి
కేసీఆర్ కుటుంబం ధరణి పోర్టల్ తీసుకొచ్చి.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 18 లక్షల కోట్ల రూపాయల భూములు ఆక్రమించారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఇది దేశంలోనే అతిపెద్ద భూస్కామ్ అని అన్నారు. ధరణి ద్వారా రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు కేసీఆర్ చేతుల్లోకి వెళ్తున్నాయన్నారు.

కేసీఆర్ ఫాంహౌస్ 600 ఎకరాలు ధరణి పోర్టల్లో ఎందుకు లేవు?
హైదరాబాద్ చుట్టూ ఎంతో విలువైన భూములు ఉన్నాయి. సామాన్యుల నుంచి వాటిని కాజేయాలని కుట్ర చేశారు. రూ. 18 లక్షల భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. కేసీఆర్, కేటీఆర్‌కు కలిపి 60 ఎకరాల భూమి మాత్రమే ఉందని 2013లో కేసీఆర్ చెప్పారు. కానీ, కేసీఆర్ ఫాంహౌస్‌లోని 600 ఎకరాల వివరాలు ధరణి పోర్టల్‌లో లేవు. ఆ భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలియట్లేదు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ధరణి పోర్టల్ అవినీతిపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

మునుగోడులో చరిత్రాత్మక తీర్పు వస్తుందన్న కోమటిరెడ్డి
మునుగోడు ఉపఎన్నిక భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబానికి, నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని కోరారు. తాను భయపడి ఇంట్లో కూర్చోలే అని.. మునుగోడు అంటే ఈ రోజు ప్రపంచం చర్చించుకునేలా చేశానని గర్వంగా చెప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులను దూరం పెట్టి.. తెలంగాణ ద్రోహులను కేసీఆర్ తన పక్కన పెట్టుకున్నారన్నారు. ఉద్యమకారుడైన ఈటల రాజేందర్‌ను కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications