మునుగోడు దత్తతపై మంత్రి కేటీఆర్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి సూటిప్రశ్న
మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నిక విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న బిజెపి, ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళుతుంది. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగుతున్నారు. ఇక ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి సైతం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి సతీమణి లక్ష్మి మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసి సూటి ప్రశ్న వేశారు. ఇటీవల మంత్రి కేటీఆర్ మునుగోడు దత్తత తీసుకుంటానని ప్రకటించడం, ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఆ అంశాన్ని ప్రస్తావించడాన్ని టార్గెట్ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని, అధికారంలో ఉన్న పార్టీ మునుగోడును దత్తత తీసుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

అధికారంలో ఉండి మునుగోడును దత్తత తీసుకోవటం దేనికి ? సూటి ప్రశ్న
రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అధికార ప్రభుత్వానికి ఉంటుందని, ఆ విషయాన్ని మరిచి కేవలం మునుగోడు ఉప ఎన్నిక కోసం మునుగోడును దత్తత తీసుకుంటామని ప్రకటించడంపై ఆమె మంత్రి కేటీఆర్ కు సూటి ప్రశ్న వేశారు. దత్తత పేరిట కేసీఆర్ అనేకసార్లు మోసం చేశారని, ఇప్పుడు ఆయన కొడుకు కేటీఆర్ మోసం చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి పేర్కొన్నారు.

ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఓడించటానికి ఇంతమంది ప్రచారమా?
శివన్నగూడ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వడానికి మనసొప్పదు కానీ ఉప ఎన్నికలో లక్షల కోట్ల ప్రజా ధనాన్ని అధికార పార్టీ ఖర్చు చేస్తుందని ఆమె ఆరోపించారు. ఒక్క రాజగోపాల్ రెడ్డి ని ఓడించడానికి 84 మంది ఎమ్మెల్యేలు, 12 మంది మంత్రులు, 16 మంది ఎమ్మెల్సీలు మునుగోడులో మకాం వేశారని ఆమె ఎద్దేవా చేశారు. ఇక ఆఖరుకు సీఎం కేసీఆర్ సైతం లెంకలపల్లి గ్రామానికి ఇన్చార్జిగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీఆర్ఎస్ ను మునుగోడు ప్రజలు ఆదరించబోరు
మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తోనే మునుగోడు నియోజకవర్గంలో ఆగిపోయిన పనులు ప్రారంభించారని, కాస్తోకూస్తో అభివృద్ధి జరుగుతుందని ఆమె తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని మోసపు హామీలు ఇచ్చినా మునుగోడులో ప్రజలు టిఆర్ఎస్ పార్టీని ఆదరించబోరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications