కొమురవెల్లి మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్: జాతరకు దేవాదాయ శాఖ స్పెషల్ ప్లాన్!

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కొమురవెల్లి మల్లన్న కల్యాణం, జాతరలను తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వైభవోపేతంగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. వేలాదిగా జాతరకు తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న పొరపాటు తలెత్తకుండా పటిష్టమైన కార్యాచరణతో ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. సోమ‌వారం సెక్రటేరియట్‌లోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి సురేఖ సిద్దిపేట జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం కంటే ముందు మల్లన్న జాతర, కళ్యాణం పోస్టర్‌ ను మంత్రి సురేఖ రిలీజ్ చేశారు.

సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మాట్లాడుతూ.. గత సంవత్సరం కంటే మరింత వైభవోపేతంగా మల్లికార్జున స్వామివారి కల్యాణం, జాతరను నిర్వహించనున్నట్లు తెలిపారు. గత సంవ‌త్స‌రం జాత‌ర‌, క‌ల్యాణం నిర్వ‌హించిన స‌మ‌యంలో త‌లెత్తిన ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సారి అవి రాకుండా చూడాల‌ని సూచించారు. డిసెంబర్ 14 ఉదయం 10.45 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణాన్ని, జ‌న‌వ‌రి 18 నుండి 10 వారాలపాటు మార్చి 16 వరకు జాతరను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. ఈ దిశగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలని పోలీస్, విద్యుత్, వైద్యారోగ్యం, ఆర్టీసి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కల్యాణాన్ని వీక్షించి, స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యేందుకు వీలుగా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ కలెక్టర్‌కు సూచించారు.

Komuravelli Mallanna Jatara 2026 Minister Konda Surekha Reviews on Special Arrangements

గతేడాది జరిగిన జాతర, కల్యాణం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కల్యాణ వేదికను విశాలంగా తీర్చిదిద్దాలని దేవాదాయ అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమ్మవార్లు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు కిరీటాల తయారీ పనుల పై మంత్రి సురేఖ వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు కల్యాణోత్సవానికి, జాతరకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే పరిస్థితులున్నందున ఈ దిశగా చర్యలు చేపట్టాలని సిద్దిపేట డిపో మేనేజర్ కు మంత్రి సురేఖ సూచించారు. భక్తుల క్యూలైన్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా, వీవీఐపీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, భక్తులకు దారులను తెలిపేలా సైన్ బోర్డులు, తాగునీటి సదుపాయం, మెడికల్ క్యాంపు, లాక్టేషన్ గదులు తదితర ఏర్పాట్లు చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. జాతర సమయానికి వేసవి కాలం రానుండటంతో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, నడిచే మార్గాల్లో మ్యాట్లు, వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు బ్యాటరీ వాహనాలు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మల్లికార్జున స్వామివారి కల్యాణం, జాతరను విస్తృతంగా జనంలోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భక్తులకు సాయపడేలా అవసరమైన చోట వాలంటీర్లు, ఆశా కార్యకర్తల సేవలను వినియోగించుకునేలా కార్యాచరణను రూపొందించాలని సూచించారు.

స్వామివారి ప్రసాదం తయారీలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాతర జరుగుతున్నన్ని రోజులు సాయంత్రాల్లో కళాబృందాలచే ఒగ్గుకథ వంటి జానపద కళారూపాలను ప్రదర్శించేలా సాంస్కృతిక శాఖకు ఆదేశాలివ్వాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. కల్యాణోత్సవానికి వారం రోజుల ముందే సర్వసన్నద్ధంగా వుండేలా కార్యాచరణను వెంటనే అమలుపరచాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. కల్యాణంతో పాటు, జాతర జరిగినన్ని రోజుల దేవాలయాన్ని దేదీప్యమానంగా ముస్తాబు చేయడంతో పాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఈ సారి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తున్న త‌రుణంలో వైద్య శాఖ త‌గిన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్య‌లున్న భ‌క్తులు సైతం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. అందుచేత ఏదైనా వారి ఇబ్బందులు జరిగితే, సీపీఆర్ చేసేందుకు డాక్ట‌ర్ల‌ను, పారామెడిక‌ల్ సిబ్బంది ప‌క్క‌గా అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. ఆల‌యంలో, ఆల‌య ఆవ‌ర‌ణ‌లో ప‌రిశుభ్ర‌త త‌ప్ప‌నిస‌రి అని... అందుకోసం అవ‌స‌ర‌మైతే పారిశుద్ధ్య సిబ్బందిని ప్ర‌త్యేకంగా అపాయింట్ చేసుకోవాల‌ని క‌లెక్ట‌‌ర్‌కు చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి(జ‌న‌గామ‌), ఎండోమెంటు ప్రిన్సిప‌ల్ సెక‌ట్ర‌రీ శైల‌జ రామ‌య్య‌ర్‌, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్​, సిద్దిపేట కలెక్టర్ హైమావ‌తి, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), ఆర్డీవో, కొమురవెల్లి ఆలయ ఈవో టంక‌శాల‌ వెంక‌టేశ్‌, ఆర్టీసీ డిపో మేనేజర్, డీఎంహెచ్ఓ, డీపీఓ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది,గ్రామీణ నీటి సరఫరా, ఫైర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ తదితర శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

దేవాదాయ శాఖ మంత్రి సురేఖ అక్క మ‌ల్ల‌న్న భ‌క్తురాలుః ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మ‌ల్ల‌న్నస్వామి భ‌క్తురాలని జ‌న‌గామ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయ‌న‌... ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మంత్రి సురేఖ చాలా భక్తి కల్గిన మంత్రి అని ఉద్ఘాటించారు. ఆమె జాతర సమయంలోమ‌ల్ల‌న్న ప‌ట్నాలు వేసుకుంటూ త‌న భ‌క్తిని స్వామివారి ప‌ట్ల ప్ర‌ద‌ర్శిస్తార‌ని చెప్పారు. దాంతోపాటు వైద్య సిబ్బందిని చేర్యాలతోపాటు ద‌గ్గ‌ర‌లో ఉన్న ఆసుప‌త్రుల నుంచి తీసుకొచ్చి జాత‌ర జ‌రుగుతున్న రోజులు భ‌క్తుల‌కు వైద్య సేవ‌లు అందించాల‌న్నారు.

జాతర వారములు:
18‌‌-01-2026 మొదటి ఆదివారం

25-01-2026 రెండో ఆదివారం

01-02-2026 మూడో ఆదివారం

08‌‌-02-2026 నాలుగో ఆదివారం

15-02-2026 ఐదో ఆదివారం

15-02-2026 మహాశివరాత్రి

22-02-2026 ఆరొవ ఆదివారం

01-03-2026 ఏడో ఆదివారం

08‌‌-03-2026 ఎనిమిదో ఆదివారం

15-03-2026 తొమ్మిది ఆదివారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+