మరో వివాదంలో కొండా కపుల్.. కత్తితో బెదిరించారని ప్రధాన అనుచరుడిపై కేసు!
తెలంగాణ రాజకీయాలలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కొండా కపుల్ పేరు మరోమారు తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొండ అనుచరుడిగా పేరొందిన నవీన్ రాజ్ మరియు అతని అనుచరుల పైన కేసు నమోదయింది. గతంలో కొండా సురేఖ అనుచరుడు గోపాల నవీన్ రాజ్‌కు గన్మెన్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024 అక్టోబర్‌లో, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది,
డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాజిద్ పైన కొండా అనుచరుడి దాడి
ఇది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. ఇక ప్రస్తుతం తాజాగా కొండా అనుచరుడిగా చెప్పే గోపాల నవీన్ రాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కత్తితో బెదిరించి దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 25వ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాజిద్ పైన నవీన్ రాజ్ అతని అనుచరులు దాడికి పాల్పడినట్టు అతను తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. కేసు నమోదు
నవీన్ రాజ్ తీరు పైన వాట్సప్ గ్రూపులో ఆడియోలు పెట్టినందుకు తనను లక్ష్యంగా చేసుకొని నవీన్ రాజు అతని అనుచరులు కత్తితో బెదిరించారని, దాడి చేశారని పేర్కొన్నారు. తనకు వాళ్లతో ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అనుచరుల ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదును తీసుకున్న ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్, ఘటనపై బీఎన్ఎస్ సెక్షన్లు 118, 296, 351 కింద కేసు నమోదు చేసింది.
కొండా దంపతుల అనుచరుల ప్రవర్తనపై చర్చ
బాధితుడు సాజిద్, ప్రధాన బాధ్యుడిగా నవీన్ రాజ్‌పైనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన వెలుగులోకి రావడంతో కొండా దంపతుల రాజకీయ జీవితం మరోమారు చర్చనీయాంశమైంది. కొండా దంపతులు మాత్రమే కాక వారి అనుచరుల ప్రవర్తన కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. స్థానికంగా కొండా అనుచరులుగా భావిస్తున్న చాలామంది నియోజకవర్గంలో ఇదే తీరుతో వ్యవహరిస్తుండడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది .
కాంగ్రెస్ లో కుమ్ములాట.. నవీన్ రాజ్ పై కేసుతో కొత్త రగడ
కొండా దంపతులు మాత్రమే కాదు, కొండ అనుచర గణం కూడా కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా మారుతుండటం ప్రధానంగా కనిపిస్తుంది.కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లోనూ ఈ ఘటన పెద్ద చర్చనీయాంశమైంది. ఒకే పార్టీలోని నేతల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం, ఫిర్యాదులు పోలీసుల వరకు వెళ్లడం పార్టీ బలహీనతలను బయటపెడుతోందని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవీన్ రాజ్ అనుచరులపై కేసులు నమోదవడంతో ఈ వివాదం ఇంకా ఎటు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications