కొండా సురేఖ కాంట్రవర్సీ కథ కంచికే..అయిపాయ్!
తెలంగాణ రాజకీయాలలో మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్నారు. తరచూ వివాదాలలో ఉండే కొండ సురేఖ తాజాగా ఆమె దగ్గర పనిచేస్తున్న ఓ ఎస్ డి సుమంత్ తొలగింపుతో మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇక సుమంత్ తొలగింపు తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది అన్న భావన ప్రతి ఒక్కరికి కలిగేలా చేశాయి.
కొండా సురేఖ ఎపిసోడ్ తో టెన్షన్ టెన్షన్
హైదరాబాదులోని కొండ సురేఖ నివాసం వద్ద భద్రత ఉపసంహరించడం, హన్మకొండలోని ఆమె నివాసం వద్ద కూడా భద్రతను ఉపసంహరించి, పోలీస్ ఔట్ పోస్ట్ తీసేయడం, ఇంటి వద్దపోలీసుల పహారా వంటి ఘటనలతో పాటు, నిన్న మంత్రివర్గసమావేశంతో కొండా సురేఖకు ఉద్వాసన పలుకుతారని అందరూ భావించారు. కానీ కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఒకవేళ కొండా సురేఖను మంత్రిపదవి నుంచి తీసేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పకనే చెప్పారు.

రేవంత్ రెడ్డిని, ఆయన సోదరులను టార్గెట్ చేసిన కొండా సుస్మిత
ఒక బీసీ మహిళా మంత్రిని రెడ్లు అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ని, వేం నరేందర్ రెడ్డి ని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని పేర్లు చెప్పి మరి విమర్శలు గుప్పించిన సురేఖ కూతురు కొండ సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి కి దగ్గరగా ఉండే రోహిణ్ రెడ్డి, సీఎం సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి చేస్తున్న దందాలపైన విరుచుకు పడ్డారు. మంత్రిగా పనిచేస్తున్న కొండా సురేఖకు భద్రత ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తూనే, రేవంత్ రెడ్డి సోదరులకు భద్రత అవసరమా అంటూ నిలదీశారు.
వారి వెనుక రేవంత్ రెడ్డి లేరా? సుస్మిత సూటి ప్రశ్న
డెక్కన్ సిమెంట్స్ కోసం మాట్లాడడానికి వచ్చిన వారిని బెదిరించినట్టు చెబుతున్న వార్తలలో ఉన్న రోహిణ్ రెడ్డి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లి శాఖలో ఉన్న ఫైళ్లను రేవంత్ రెడ్డి తన వాళ్ల కోసం తెప్పించుకుంటున్నారు అని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో దుమారం గా మారాయి.
కాంగ్రెస్ అధిష్టానానికి కొండా సుస్మిత షాక్
ఒకపక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మరోవైపు భవిష్యత్తులో జరగాల్సిన లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో ఏకంగా ముఖ్యమంత్రి నే టార్గెట్ చేసి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత మాట్లాడడం అటు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కొండా సురేఖ, కొండా సుస్మిత మీనాక్షి నటరాజన్ ను కలిసి ప్రస్తుత వివాదానికి గల కారణాలు, కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు.
సురేఖ ఎపిసోడ్ తో ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం
రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు మూడు రోజుల ఎపిసోడ్ పై వివరణ ఇచ్చిన కొండ సురేఖ కావాలని తనను టార్గెట్ చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అయితే సురేఖ, ఆమె కుమార్తె చెప్పింది విన్న కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ కొండా సురేఖ పైన చర్యలకు దిగితే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అభాసు పాలయ్యే అంశాలు బయటకు వస్తాయని అధిష్టానం ఆలోచనలో పడింది.
కొండా ఎపిసోడ్ ముగిసినట్టేనా?
ఇప్పటికే కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి పైన చర్చ జరుగుతున్న వేళ తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం లేదు. ఈ క్రమంలోనే కొండ ఎపిసోడ్ కు కాంగ్రెస్ అధిష్టానం ముగింపు పలికినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications