కేసీఆర్ పాలన, జగన్ పాలన రెండూ దుష్ట పాలనలే: కొండా సురేఖ సెన్సేషన్!!
తెలంగాణ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలన, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన రెండు దుష్ట పాలనలే అని కొండా సురేఖ విరుచుకుపడ్డారు. వన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొండా సురేఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల మీద దాడులు, అసభ్య పదజాలంతో దూషణలు చూస్తుంటే రాజకీయాల మీదనే ఏవగింపుగా ఉందన్నారు.
మంత్రులు నోటికొచ్చినట్టు దుర్భాషలాడటం రాజకీయాలకే తలవంపులు తెస్తుందని, ముఖ్యంగా మహిళామంత్రులు మాట్లాడుతున్న తీరు తమ వంటి వారికి ఇబ్బందిగా మారుతుందని కొండా సురేఖ పేర్కొన్నారు. తాము రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామన్న భావన కలుగుతుందని కొండా సురేఖ పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కొడుకు అంటే తాను నమ్మలేనని, రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కొండా సురేఖ అభిప్రాయం వ్యక్తం చేశారు.

జగన్మోహన్ రెడ్డి పాలనను తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నానని కొండా సురేఖ పేర్కొన్నారు. అటు జగన్ పాలన ఇటు కేసీఆర్ పాలన రెండూ నియంత పాలనలేనని కొండ సురేఖ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం, తెలుగుదేశం పార్టీ నేతలను కొట్టడం, జైళ్లలో పెట్టడం వంటి చర్యలను ఏమంటారు అని ప్రశ్నించారు.
గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు మీద ఈ విధంగా ప్రతీకార చర్యలకు దిగలేదని కొండా సురేఖ అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబును జైల్లో పెట్టి జగన్ సాధించింది ఏమిటి అని ప్రశ్నించారు కొండా సురేఖ. తాను జైలు జీవితాన్ని అనుభవించాడు కాబట్టి చంద్రబాబును కూడా జైల్లో పెట్టాలన్న కక్ష తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన, కుటుంబ పాలన కొనసాగుతుందని, తెలంగాణ ప్రజలను అడుగడుగున కెసిఆర్ కుటుంబం మోసం చేస్తున్నారని, అక్కడ జగన్ కుటుంబం ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో మోసం చేస్తున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. కెసిఆర్ పాలన, జగన్ పాలన రెండు రాక్షస పాలనలేనని ఈ ఇద్దరినీ ఎన్నికలలో ప్రజలు ఓడగొట్టాలని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications