కెసిఆర్ లాంటి నేత మీ పార్టీలో ఉన్నారా: కెటిఆర్, మండిపడ్డ కవిత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లాంటి భాషా సంపత్తి కలిగిన నేత ఒక్కరైనా ఉన్నారా అని మంత్రి కెటి రామారావు మంగళవారం నాడు నిప్పులు చెరిగారు. ఇటీవల వరుస ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ మైండ్ బ్లాంక్ అయిందన్నారు.
గతంలో వారు చేసిన తప్పులు, పాపాలు బయటపడతాయనే భయం వారికి పట్టుకుందని, అందుకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు రాలేదన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరికీ అర్థమైనా కాంగ్రెస్ పార్టీకి అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.
పదేళ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు దుర్మార్గాన్ని ఎందుకు అడ్డుకోలేదో చెప్పాలన్నారు. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వారేం చేస్తారని నిలదీశారు. పదేళ్ల చేతగానితనాన్ని చెప్పుకుంటారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు ముస్లీంలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 5 శాతం రిజర్వేషన్ అని చెప్పి, నాలుగు శాతమే ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వారిని ఓటు బ్యాంకుగానే చూస్తోందని ధ్వజమెత్తారు. నీటి సమస్యపై చర్చిద్దామంటే అసెంబ్లీ నుంచి పారిపోయిన ఉత్తమ్ కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు.
మాట్లాడే అర్హత లేదు: కవిత
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం అన్‌సాన్‌పల్లిలో 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు ఎంపీ కవిత మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రధానమైన నీటి సమస్యపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినపుడు ప్రతిపక్ష పార్టీల సభ్యులు హాజరుకాక పోవడంపై మండిపడ్డారు. అసెంబ్లీకి రాని నాయకులకు ప్రాజెక్టులపై మాట్లాడే అర్హతలేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications