కెటిఆర్ - అమెరికా స్టయిల్ 'టౌన్ హాల్': మూసీ పొడవునా ఫ్లై ఓవర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అమెరికా స్టయిల్‌ను అనుసరించారు. అమెరికాలో 'టౌన్ హాల్ సమావేశాలు' నిర్వహిస్తుంటారు. కెటిఆర్ కూడా హైదరాబాదులో 'బ్రాండ్ హైదరాబాద్' పేరుతో మంగళవారం టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు.
హైదరాబాదులోని శిల్పారామం రాక్ హైట్స్‌లో మంగళవారం నిర్వహించిన బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో కేటీఆర్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. రెండు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో ఏకబిగిన నలభై నిమిషాలపాటు నగరాభివృద్ధిపై కెటిఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో తమ విజన్‌ను ఆవిష్కరించారు.
ఆ తర్వాత కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల సందేహాలు, సమస్యలపై సమాధానం ఇచ్చారు. గత పద్దెనిమిది నెలల కాలంలో తమ ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేసిందని, కోతలులేని నిరంతర విద్యుత్ అందించి తన పని తీరు ఏమిటో చాటి చెప్పిందని చెప్పారు.

ఇదే దారిలో నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు 100 కిలోమీటర్ల మేర స్కైవేలతోపాటు గ్రేడ్ సెపరేటర్లు, మల్టీలెవల్ ఫ్లెఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించి సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు.
నగరంలో అతి పొడవైన ఫ్లై ఓవర్ మూసీ నది పొడవునా రాబోతుందన్నారు. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు 72 కిలో మీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురావటంతో పాటు మెట్రో మార్గాలను మరింత విస్తరిస్తున్నామన్నారు.
మంచినీటి సరఫరా మెరుగుపరిచేందుకు గోదావరి జలాలు తరలించామని, 30 టీఎంసీల సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి నగరానికి ధీమా కల్పిస్తున్నామని చెప్పారు. చరిత్రాత్మక హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ప్రారంభమైందని, నగరంలోని 169 చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఒక విజన్‌తో అభివృద్ధికి బాటలు పరిచి ఒలింపిక్స్ నిర్వహించే స్థాయికి నగరాన్ని తీర్చి దిద్దుతామన్నారు. విద్యావంతులైన వారు దురదృష్టవశాత్తూ రాజకీయ నాయకులను విమర్శించేందుకు మాత్రమే పరిమితమై పోతున్నారని, ఓటింగ్ అంటే కేవలం హాలిడేగా పరిగణిస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
కీ బోర్డు కామెంట్లకు తమను తాము పరిమితం చేసుకోకుండా ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణం చేయాలని కెటిఆర్ యువతకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. సిటిజన్ ఫ్రెండ్లీ నగరంగా, సాంస్కృతిక-సామాజిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. బాధ్యతాయుత పాలనను అందించేందుకు సిటిజన్ చార్టర్ అమలులోకి తెస్తామన్నారు.












Click it and Unblock the Notifications