ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో BRS మద్దతు పై తేల్చేసిన కేటీఆర్..!!
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేంద్రంగా తెలంగాణలో ఆసక్తి కర రాజకీయం కొనసాగుతోంది. ఇండియా బ్లాక్ నుంచి తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ నుంచి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ రాధాక్రిష్ణన్ పోటీలో ఉన్నారు. తెలంగాణ కు చెందిన సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తుండటంతో.. పార్టీలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీ లు మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. దీని పైన స్పందించిన కేటీఆర్ ఈ ఎన్నికలో తమ వైఖరి ఏంటో స్పష్టం చేసారు. కొత్త అంశం తెర మీదకు తెచ్చారు.
దేశ వ్యాప్తంగా ఆసక్తిని పెంచుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా కూటమి అభ్యర్దిగా తెలంగాణకు చెందిన సుప్రీం మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని ప్రకటించారు. సీఎం రేవంత్ సూచన మేరకే సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది.

కాగా, ఏపీ - తెలంగాణలోని అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా.. రాజ్యాంగ పరిరక్షణ కోసం న్యాయకోవిదుడు అయిన సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని రేవంత్ అభ్యర్ధించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సుదర్శన్ రెడ్డి విషయం లో బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా లేదా అనేది ప్రస్తుతం రాజకీయంగా హాట్ డిబేట్ గా మారింది. ఈ సమయంలోనే తమ విధానం ఏంటనేది కేటీఆర్ స్పష్టం చేసారు.
ఉప రాష్ట్రపతి ఎన్నిక పైన కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నిక అంతా డ్రామాగా అభివర్ణించారు. బీఆర్ఎస్ ఏ కూటమిలోనూ భాగస్వామిగా లేదని చెప్పారు. మద్దతు కోసం తమను ఏ కూటమి నేతలు సంప్రదించలేదని తేల్చేసారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ స్పష్టం చేసారు.
తెలంగాణకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు ఇస్తారో వారికే మద్దతుగా నిలుస్తామన్నారు. తమకు మోదీ.. రాహుల్ బాస్ లు కాదని.. రాష్ట్ర ప్రజలే తమకు బాస్ లు అని స్పష్టం చేసారు. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్దిని ఎందుకు రేవంత్ ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా ప్రతిపాదించలేదని కేటీఆర్ కొత్త చర్చకు తెర తీసారు. బీసీలపై ప్రేమ మాటల్లోనే కానీ, చేతల్లో లేదా అని నిలదీసారు. ఇంకా ఎన్నికకు సమయం ఉందని.. పార్టీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications