మోడీని కెసిఆరే పిలువలేదు, మంత్రి కెటిఆర్‌కు ఆ స్థాయిలేదు: బిజెపి
హైదరాబాద్: అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నా ప్రధాని మోడీ తెలంగాణకు రాలేదన్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పైన భారతీయ జనతా పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి, మరో నేత నాగం జనార్ధన్ రెడ్డిలు కెటిఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.
బుధవారం కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాని మోడీ విషయంలో కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదన్నారు. తెలంగాణకు రావాలని ప్రధాని మోడీని ఇంత వరకు ప్రభుత్వం ఆహ్వానించలేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇప్పుడు ప్రధాని పైన విమర్శలు చేస్తున్నారన్నారు.
కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు మంత్రి కెటిఆర్ ఎలా శంకుస్థాపన చేస్తారని ప్రశ్నించారు. బిజెపిని, ప్రధాని మోడీని విమర్శించేస్థాయి కెటిఆర్‌కు లేదా తెరాసకు లేదన్నారు. తెరాస దయాదాక్షిణ్యాలతో బిజెపి అధికారంలోకి రాలేదన్నారు. తెలంగాణ కోసం కేంద్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఆయుత చండీయాగానికి ప్రధాని మోడీని కెసిఆర్ ఆహ్వానించలేదన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి కెటిఆర్‌కు లేదని బిజెపి నేత, తెలంగాణ బచావో వ్యవస్థాపకులు నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం అన్నారు. తెలంగాణ పైన మోడీకి ప్రేమ లేదని కెటిఆర్ చెప్పడం సరికాదన్నారు. కెటిఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ప్రధాని మోడీ కృషి వల్లే తెలంగాణ వచ్చిందన్న విషయం మరవవద్దన్నారు.
జనవరి నెలాఖరున సమావేశాలు
జనవరి నెలాఖరున అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి చెప్పారు. కరువు, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చిస్తామన్నారు. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల అనర్హత అంశాలపై రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు.












Click it and Unblock the Notifications