ఎమ్మెల్యేల పార్టీ మార్పు పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు వరుసగా కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఈ సమయంలోనే పార్టీ అధినేత కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో రాజకీయం మారుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు.
గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. జగిత్యాలకు పట్టిన శని పోయిందని ఈ నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనషుల విలువ తెలుస్తుందన్నారు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోవని... గట్టి నాయకులు కొట్టుకుపోరని చెప్పారు. గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమేనని వ్యాఖ్యానించారు.

గడ్డిపారల్లాంటి మీరు వెళ్లలేదు.. ఒక గడ్డిపోచ మాత్రమే కొట్టుకుపోయింది అని ఎమ్మెల్యే సంజయ్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కవితక్కతో సహా వేల మంది కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అయ్యాడని గుర్తు చేసారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దొంగల్లో కలిసాడని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతులకు ఆశపడి పోయాడని సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే బుద్ది ఇవాళ తెలిసి వచ్చిందని చెప్పారు. అభివృద్ధి కోసం పోయినా అని సంజయ్ అన్నారని గుర్తు చేసారు. జగిత్యాల జిల్లా రద్దు చేస్తా.. మెడికల్, నర్సింగ్ కాలేజీ రద్దు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నందుకు సంజయ్ కాంగ్రెస్‌లోకి వెళ్లాడా అని కేటీఆర్ ప్రశ్నించారు












Click it and Unblock the Notifications