వెయ్యి కోట్ల కుంభకోణం - కేటీఆర్ సంచలనం..!!
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసారు. పౌర సరఫరాల శాఖలో భారీ స్కాం జరిగిందన్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పేరుతో 700 నుంచి 750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కింద 2.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో 300 కోట్లు.. మొత్తంగా వెయ్యి కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం ఖండించింది.
కీలక ఆరోపణలు
మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణలోని ప్రస్తుత ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేసారు. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి.. జనవరి 25న కమిటీ వేసింది. అదే రోజు మార్గదర్శకాలు జారీ చేసి.. టెండర్లను పిలిచిందని వివరించారు. ప్రత్యేక నిబంధలు పెట్టి కేవలం నాలుగు కంపెనీలకే టెండర్లు వచ్చేటట్టు చేశారు. కేంద్రీయ బండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ కంపెనీ, నాక్‌హాఫ్ అనే నాలుగు సంస్థలు ఈ టెండర్లను దక్కించుకున్నాయని చెప్పారు.

రూల్స్ మినహాయించారు
గురుకులాల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత సరిగ్గా పనిచేయలేదని కేంద్రీయ బండార్ అనే సంస్థను 2023లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేంద్రీయ బండార్ సంస్థ కోసం రూల్స్‌ను రిలాక్స్ చేశారని వివరించారు. మిల్లర్లు క్వింటాలుకు 210 చెల్లించి కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ఆ నాలుగు కంపెనీలకే టెండర్లు కట్టబెట్టారన్నారు. అయితే, క్వింటాలుకు దాదాపు 200 తగ్గించి.. 1885-2007 రూపాయలకు కొనుగోలు చేసేలా ఒప్పందం చేశారని చెప్పుకొచ్చారు. మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు చేస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్నారు. గోదాముల్లోని ధాన్యాన్ని తీసుకుపోకుండా రైస్ మిల్లర్లపై బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు.
ఏం జరుగుతోంది
టెండర్లు వేసింది 1885-2007 రూపాయలకు గానీ.. క్వింటాలుకు 2230 రూపాయలు చెల్లించాల్సిందే అని రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల మంది రైస్ మిల్లర్లను కాంట్రాక్ట్ సంస్థలు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాయని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. దాదాపు 35లక్షల మెట్రిక్ టన్నులకు 200 చొప్పున చూసుకున్నా 700 కోట్ల అదనపు డబ్బు మనీలాండరింగ్ ద్వారా మిల్లర్ల దగ్గర వసూలు చేస్తున్నారని వివరించారు. అసలు సంబంధం లేని ప్రైవేటు సంస్థలు.. ప్రభుత్వం తరఫున డబ్బులు ఎలా వసూలు చేస్తాయని కేటీఆర్ ప్రశ్నించారు. మిల్లర్లకు ఇచ్చిన 90 రోజుల గడువు అయిపోయింది.. ఇప్పటికీ 20 శాతం కూడా లిఫ్ట్ చేయలేదు.. దీని వెనుక ఏం జరుగుతుందని కేటీఆర్ నిలదీసారు.












Click it and Unblock the Notifications