KTR: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్: కేటీఆర్ పై ఈడీ అధికారుల ఫిర్యాదు!!
నేడు లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుందని అన్ని రాజకీయ పార్టీల హడావిడిని కొనసాగిస్తున్న వేళ, బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఓవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్లో రోడ్ షో లో పాల్గొంటున్న సమయంలో, మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడి దాడులు చేయడం, ఆమెను అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెని ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు.
అంతకుముందు కవితను అరెస్టు చేసే క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ఈడి అధికారులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఈడి అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కవిత అరెస్టు సమయంలో కేటీఆర్ తమ విధులకు ఆటంకం కలిగించారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈడి మహిళా అధికారిణి భానుప్రియ మీనా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కవిత అరెస్టుకు ముందు ఈడీ అధికారులపై కేటీఆర్ అనేక ప్రశ్నలు సంధించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆమెని ఎలా అరెస్ట్ చేస్తున్నారు అంటూ కేటీఆర్ ఈడి అధికారులను ప్రశ్నించారు. విచారణ ముగిసిందని ఆమెను అరెస్టు చేస్తున్నామని ఈడి అధికారిణి భానుప్రియ మీనా స్పష్టం చేశారని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘన కాదా అంటూ ప్రశ్నించారు.
కవితను అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తున్నారు అంటూ నిలదీశారు. ఉద్దేశపూరకంగానే.. శుక్రవారం రోజు వచ్చి కవితను అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ సోమవారం వరకు కోర్టులు అందుబాటులో ఉండవని తెలిసే, ఈ అరెస్ట్ చేశారని ఆరోపించారు.
సుప్రీంకోర్టులో ఈడీ అధికారులకు ఇబ్బందులు తప్పబోవని కేటీఆర్ హెచ్చరించారు. ట్రాన్సిట్ వారంట్ అనేది లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారని ఆయన నిలదీశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ తమ విధులకు ఆటంకం కలిగించారని కేటీఆర్ పైన ఈడీ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications