అర్ధరాత్రి సాయం.. నేనున్నానని భరోసా.. మరోసారి గొప్ప మనసు చాటుకున్న కేటీఆర్..
లాక్ డౌన్ వేళ చాలామంది రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటివారందరికీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఆపద్బాంధవుడిలా మారారు. ఏ క్షణాన ఒక్క ట్వీట్ చేసినా చాలు.. వెంటనే స్పందిస్తున్నారు. సమస్య పరిష్కారానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన తన పెద్ద మనసు చాటుకున్నారు. తల్లి లేని ఓ చిన్నారి అర్ధరాత్రి వేళ పాల కోసం ఏడుస్తుంటే.. గంటల వ్యవధిలో ఆ ఇంటికి పాలతో పాటు అవసరమైన అన్ని నిత్యావసరాలు పంపించారు. కేటీఆర్ చేసిన ఈ సహాయానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ జరిగింది..
హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్ నగర్‌బస్తీకి చెందిన లఖన్‌సింగ్ ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. నెల క్రితం లఖన్‌సింగ్ భార్య జ్యోతి అనారోగ్యంతో చనిపోయింది. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కూలీ పనులు లేక లఖన్‌సింగ్ ఇంటికే పరిమితమయ్యాడు. ఐదు నెలల తన బిడ్డకు పాలు కొనేందుకు కూడా అతని వద్ద డబ్బులు లేని పరిస్థితి. దీంతో ఆ చిన్నారి శుక్రవారం ఉదయం నుంచి గుక్క తిప్పుకోకుండా ఏడుస్తోంది. ఏం చేయాలో తెలియక లఖన్‌సింగ్ నిస్సహాయంగా ఉండిపోయాడు.

అర్ధరాత్రి వేళ షాపులు తెరిపించి మరీ..
ప్రేమ్ నగర్ బస్తీకే చెందిన మజ్జిగ నవీన్ అనే వ్యక్తి గురువారం రాత్రి 10.19గంటలకు చిన్నారి పాల సమస్యపై మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. 11.26గంటలకు ట్వీట్‌ను గమనించిన కేటీఆర్.. వెంటనే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ను అక్కడికి పంపించారు. దీంతో అర్ధరాత్రి 12గంటల వేళ బాబా ఫసీయుద్దీన్ ఆ కాలనీకి వెళ్లారు. అప్పటికే షాపులన్నీ మూసివున్నా.. ఓ కిరాణ షాపును,మెడికల్ షాపును తెరిపించారు.పాలపొడి, బిస్కెట్లు, డైపర్లు, నెలకు సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేసి లఖన్‌సింగ్‌కు అందజేశారు.

కేటీఆర్‌కు బస్తీ వాసుల కృతజ్ఞతలు
శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లఖన్‌సింగ్ ఇంటికెళ్లి కూరగాయలు సహా మరికొన్ని నిత్యావసరాలు అందజేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మీకు అండగా ఉన్నారని.. ఏ సమస్య వచ్చినా తెలియజేయాలని కోరారు. తమ సమస్యలను గుర్తించి తీర్చినందుకు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గోపినాథ్, డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్‌కు లఖన్‌సింగ్, బస్తీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. తాను సమాచారం ఇవ్వగానే అర్ధరాత్రి వేళలోనూ అక్కడికి వెళ్లిన బాబా ఫసీయుద్దీన్‌ను కేటీఆర్ అభినందించారు.
Recommended Video

ఏ సాయం కోరినా..
ఇదొక్కటే కాదు.. ట్విట్టర్‌లో ఎవరూ ఏ సాయం కోరినా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో చాలామందిలో కేటీఆర్‌కు ట్వీట్ చేస్తే తప్పక సాయం లభిస్తుందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ కారణంగానే ప్రతీరోజూ ఎంతోమంది ట్విట్టర్‌లో ఆయన సాయం కోసం ట్వీట్స్ పెడుతున్నారు. అనారోగ్య సమస్యలైనా.. అత్యవసర ప్రయాణాలైనా... ఇంకేవైనా సరే కేటీఆర్ త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకుంటుండటంపై నెటిజెన్స్ ఆయన్ను అభినందిస్తున్నారు.












Click it and Unblock the Notifications