లక్ష ఇళ్ళు రాత్రికి రాత్రి ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి చిట్టీ.. కేటీఆర్ సెటైర్లు!
తెలంగాణా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ కు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించలేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని మండిపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న వేశారు.
మాది నిర్మాణం .. మీది కూల్చివేత
మేము నిర్మిస్తే - మీరు కూల్చేస్తున్నారు అని మండిపడ్డారు. మూసీ నది సాక్షిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి పేదలకు ఇచ్చామని, ఇప్పుడు మీరు వాటిని కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. మాది నిర్మాణం - మీది విధ్వంసం అంటూ నిప్పులు చెరిగారు. లక్షల నిర్మాణాలు మావి - లక్షల కూల్చివేతలు మీవి అంటూ కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న కూల్చివేతలను టార్గెట్ చేశారు.

కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దం అని చెప్పే సాక్ష్యం ఇదే
మూసి నది సాక్షిగా ఇదిగిదిగో మహానగరం లో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అంటూ ఆ ఇళ్ళ పోటోలను చూపించారు. నాటి ఫోటోలను, పేపర్ కటింగ్ లను పోస్ట్ చేసిన కేటీఆర్ కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదేనన్నారు. తమ విధానం నిర్మాణం అయితే కాంగ్రెస్ విధానం విధ్వంసం అన్నారు.
రాత్రికి రాత్రికి ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి చెప్పాలి చిట్టి
డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టలేదన్నారని, ప్రజలను మభ్యపెట్టాం అన్నారని, మరి లక్ష ఇండ్లు రాత్రికి రాత్రికి ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి చెప్పాలి చిట్టి అంటూ ప్రశ్నించారు. మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా అని ప్రశ్నించిన కేటీఆర్ కేసీఆర్ నిజం, ఆయన హామీలు నిజం, ఆయన మాట నిజం అని తెలిసి మీకు మింగుడుపడటం లేదా అంటూ టార్గెట్ చేశారు.
ఇంకోసారి మాట్లాడకండి
మీ నాలుకలు తాటి మట్టలు కాకుంటే ఇంకోసారి అబద్దాలు మాట్లాడకండి అంటూ చురకలు అంటించారు. మీ జూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్ కు ఇవ్వాళ కేసీఆర్ గారి నిర్మాణాలే దిక్కయ్యాయి అంటూ కేటీఆర్ రేవంత్ సర్కార్ ను, కాంగ్రెస్ నేతలను తీవ్ర స్థాయిలో విమర్శించారు.
హైడ్రాకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం
ఇక ఇదే సమయంలో హైడ్రా కూల్చివేతలపై కూడా కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. నిరుపేదల ఇళ్ళు కూలుస్తూ వారి జీవితాలను నడి రోడ్డు మీదకు లాగుతున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. హైడ్రా బుల్డోజర్ లకు తాను అడ్డు నిలబడతా అన్నారు. ప్రజల కోసం హైడ్రాకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే వెల్లడించారు.












Click it and Unblock the Notifications