సోనియాను బలిదేవతగా పేర్కొన్న రేవంత్ రెడ్డి- డిఫెన్స్‌లో నెట్టిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అధికార భారత్ రాష్ట్ర సమితిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను మంత్రి కేటీఆర్ తిప్పి కొట్టారు. ఎదురుదాడికి దిగారు. ఉద్యోగాల కల్పనను కల్పించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని గుర్తు చేశారు.
తొమ్మిదిన్నర ఏళ్ల తమ ప్రభుత్వ హయాంలో 2,20,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లను ఇచ్చామని, ఇందులో 1,60,083 నియామకాలను భర్తీ చేసింది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఈ లెక్కలు తప్పని నిరూపించగలవా అంటూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో తెలంగాణలో 10,116 ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయని చెప్పారు.

తమ ప్రభుత్వం ఏడాదికి సగటున 16,850 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయగా.. కాంగ్రెస్ ఇచ్చింది 1,012 కొలువులేనని అన్నారు. ఇప్పుడొచ్చి తమకు సుద్దులు చెబితే ఎట్లా అంటూ కేటీఆర్ నిలదీశారు. జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేశావా..?, ఉద్యోగం చేశావా..? యువత ఆశలు ఆకాంక్షలు తెలుసా..? తెలుసా అంటూ ప్రశ్నలను గుప్పించారు.
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా తమ ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి, నిబద్ధతను చాటుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. తమ కొలువులు తమకే దక్కాలన్న ఉద్యమస్ఫూర్తిని నిలబెట్టి నియామకాల నినాదాన్ని నిజం చేసిన వాస్తవాన్ని కాదనగలవా..? అంటూ నిలదీశారు.
ముల్కీ రూల్స్‌ను రద్దు చేసి, తెలంగాణ స్థానికత హక్కులకు సమాధి కట్టింది కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆరుసూత్రాలు, 610 జీవోలు,..గిర్‌గ్లానీ నివేదకలు తుంగలో తొక్కి, హైదరాబాద్‌ను ఫ్రీ- జోన్‌గా మార్చేసిన ఘనత కాంగ్రెస్‌కు ఉందని విమర్శించారు. నాన్ లోకల్ కోటాలు పెట్టి, తెలంగాణ యువతకు దక్కాల్సిన కొలువులను కొల్లగొట్టి తీరని అన్యాయం చేసిన ద్రోహులు కాంగ్రెస్సేనని అన్నారు.
2004లో తెలంగాణకు ఇచ్చిన మాట తప్పి, పదేళ్ల పాటు కాలయాపన చేసి, వందల మంది యువతీ యువకుల ఆత్మబలిదానాలకు కారణమైన నేరం కాంగ్రెస్‌దేనని కేటీఆర్ విమర్శించారు. సోనియా గాంధీని బలి దేవత అంటూ గతంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధమా..? అని నిలదీశారు.

కర్ణాటక, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు కేటీఆర్. ఉద్యోగాల భర్తీ హామీని మరిచిపోయి, నిరుద్యోగులను నిండా ముంచింది నిజం కాదా అంటూ ఎదురుదాడికి దాగారు.
కాంగ్రెస్ ప్రకటించిన పసలేని జాబ్ కేలండర్ ఒక పచ్చి మోసం అని, ఎన్నికల కోడ్ అమల్లో వుండే 2024 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉద్యోగ పరీక్షలు ఎట్లా సాధ్యమని ప్రశ్నించారు. యువతను మభ్య పెట్టి నాలుగు ఓట్లు వేయించుకునే నాటకం తప్ప చిత్తశుద్ధి కనిపించట్లేదని కేటీఆర్ విమర్శించారు.












Click it and Unblock the Notifications