ఏపీకి భారీ ప్యాకేజీ ఎఫెక్ట్: హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్, జైట్లీకి హెచ్చరిక!
న్యూఢిల్లీ: కేంద్రం ఏపీకి భారీ ప్యాకేజీ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం హుటాహుటిన ఢిల్లీలో వాలి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీనికలిశారు. ఏపీకి ఇచ్చినంత ప్యాకేజీ తమకూ కావాలని కోరారు. లేదంటే తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరించారు.
విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాలని కేటీఆర్ కేంద్రమంత్రి జైట్లీకి విజ్ఞప్తి చేశారు. జైట్లీతో భేటీలో పారిశ్రామిక ప్రోత్సాహకాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పన్ను రాయితీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ఆర్థిక సాయం.. ఇలా అనేక అంశాలపై చర్చించారు.
పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఏపీకి ఐదేళ్ల పాటు ఇచ్చే రాయితీలను, పారిశ్రామిక ప్రోత్సాహకాలను, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను తెలంగాణకు కూడా వర్తింపజేయాలని కోరారు.

జైట్లీతో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగిందే సమైక్య పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయానికి వ్యతిరేకంగానే జరిగిందన్నారు. తెలంగాణలో వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్ర పాలనలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగానే వాటిని అనుభవించలేకపోయిందన్నారు.
ఫలితంగా తీవ్ర అన్యాయానికి గురైందని అన్నారు. వివక్ష కారణంగానే ప్రజలు పోరాడి, ఉద్యమించి, త్యాగాలు చేసిన తర్వాత రాష్ర్టాన్ని సాధించుకున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో, పాలనాపరమైన సంస్కరణల్లో మిగిలిన రాష్ర్టాలతో పోటీపడుతూ ముందుకు దూసుకుపోతోందన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగా గత వారం మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డును కూడా తీసుకున్నానని, దానిని బట్టి తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా మిగిలిన రాష్ట్రాలకంటే ఒక అడుగు ముందు వరుసలో ఉందని అర్థమవుతోందన్నారు. ఇదే విషయాన్ని జైట్లీకి చెప్పానన్నారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో నెరవేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.

నీతి ఆయోగ్ సైతం మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5000 కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు సిఫారసు చేసిన విషయాన్ని గుర్తు చేశానన్నారు. దీనినిఅమలులోకి తేవాలని కోరామన్నారు.
కేంద్రం గతంలో వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి కోసం ఏటా రూ.50 కోట్ల నిధులను కేటాయించిందని, తెలంగాణలోని మొత్తం పది జిల్లాల్లో తొమ్మిది వెనుకబడి ఉన్నట్లుగా కేంద్రమే గుర్తించిందన్నారు. ఈ మూడేళ్లలో ఒక్కసారి మాత్రమే రూ.450 కోట్ల మేరకు నిధులు విడుదలయ్యాయన్నారు.
ఏపీకి ఇప్పటికే మూడు విడతలుగా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం 2020 వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించిందని, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కూడా విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ హామీని తప్పకుండా నిలబెట్టుకుంటామని, త్వరలోనే తెలంగాణ సంతృప్తిపడేలా ప్రకటన చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగపూర్ మధ్య పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయాల్సిందిగా గతంలోనే కోరిందని, వీటిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదన్నారు.
సీఎం కేసీఆర్ ప్రస్తుతం మౌలిక వనరుల రూపకల్పనపై దృష్టి సారించారని, అందులో భాగంగానే ఎఫ్‌ఆర్‌బీఎం ద్వారా ప్రభుత్వం నిధులను సమకూర్చుకుంటూ ఉందని, విదేశీ ద్రవ్య సంస్థల నుంచి కూడా రుణాలను సమకూర్చుకుని ప్రాజెక్టులను రూపొందిస్తోందన్నారు.
ఏపీకి ఐదేళ్ల వరకు వీటిని సమకూర్చనున్నట్లు కేంద్రం హామీ ఇచ్చిన దృష్ట్యా అదే చట్టం ప్రకారం తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణకు కూడా ఈ రకంగానే న్యాయం చేయాలని, వివక్ష లేని విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఏపీకి న్యాయం చేయడంపై లేదా ఆర్థిక వనరులు సమకూర్చడంపై తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే తెలంగాణను విస్మరిస్తే ప్రజలు తప్పుబట్టే ప్రమాదం ఉంటుందన్నారు. అది లేకుండా చూసుకోవాలని చెప్పామన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నింటినీ అక్షరాలా అమలు చేస్తామని జైట్లీ చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications