ఇది ట్రైలర్ మాత్రమే..: పారిశ్రామికవేత్తల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR). ఈ తొమ్మిదిన్నరేళ్లలో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని.. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 24 గంటలు తాగునీరు సదుపాయం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మల్లాపూర్, గాంధీనగర్, జీడిమెట్ల, నాచారం, చర్లపల్లి ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ బుధవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నో అనుమానాలు ఉండేవని.. వీరికి పరిపాలన సాధ్యమవుతుందా? అనుకున్నారన్నారు. అయితే, పదేళ్ల కిందట 10 రోజులు కరెంటు లేకపోయినా అడిగేవారు లేరు కానీ, ఇప్పుడేమో 10 నిమిషాలు కరెంటు పోతే ఇదేనా బంగారు తెలంగాణ అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన ఒకాయన మా రాష్ట్రంలో ఐదు గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని డీకే శివకుమార్‌ను విమర్శించారు.

24 గంటల కరెంటు ఇచ్చే తెలంగాణకు వచ్చి 5 గంటల కరెంటు ఇస్తున్నాం అంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు.
కొత్త పరిశ్రమలకు ఇచ్చినట్లే పాత కంపెనీలకు కూడా రాయితీలు ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను పలువురు పారిశ్రామికవేత్తలు కోరారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని.. మన డిమాండ్స్ నెరవేర్చుకోవాలని అన్నారు. గతంలో ఇండస్ట్రీ నడపాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదని.. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయన్నారు.
Live: BRS Working President, Minister @KTRBRS speaking at Telangana Industrialists Federation (TIF) meeting in Hyderabad. https://t.co/rsjGRUkR5k
— BRS Party (@BRSparty) November 8, 2023
మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం కోసం అందరూ కస్టపడాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగం చాలా అభివృద్ధి చెందిందని వెల్లడించారు. విద్యుత్ సరిగా ఉండటం వల్లే అభివృద్ధి సాధ్యమవుతోందని చెప్పారు. అభివృద్ధి కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications