హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం రూ. 8454 కోట్లు ఇవ్వండి: కేంద్రమంత్రికి కేటీఆర్
హైదరాబాద్: మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం కోరుతూ కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రెండో విడత కింద నిర్మించబోయే బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్-ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు నిధులు అందించాలని కోరారు.
మెట్రో రెండో విడత ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 8,454 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర నిధులు అందించాలని కేటీఆర్ కేంద్రమంత్రికి విన్నవించారు. దీని కోసం 2023-24 కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని లేఖలో కేటీఆర్ కోరారు.

హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను 69 కిలోమీటర్లకు పైగా విస్తరించి విజయవంతంగా అమలు చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రెండో దశలో మొత్తం 31 కిలోమీటర్ల పొడవును రెండు భాగాలతో రూపొందించామన్నారు.
రెండో విడత కారిడార్ బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కిలోమీటర్ల పొడవునా మెట్రో మార్గం ఉండనుందని తెలిపారు. ఇందులో 23 స్టేషన్లు రాబోతున్నాయన్నారు. కారిడార్ 3లోని నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల పొడవునా 4 స్టేషన్లు వచ్చేలా నిర్మాణం ఉండనుందని మంత్రి కేటీఆర్ వివరించారు.












Click it and Unblock the Notifications