ఎన్టీఆర్ ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై కేటీఆర్ హాట్ కామెంట్స్
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. కనీసం ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదంటూ విమర్శలు గుప్పించారు.
తమ ప్రభుత్వ హయాంలో గణేష్ నిమజ్జనం కావచ్చు.. మొహర్రం ఊరేగింపు కావచ్చు.. బోనాల పండగ కావచ్చు.. ఇలా అన్ని రకాల పండగలతో పాటు ఈవెంట్లను శాంతియుతంగా చేశామన్నారు కేటీఆర్. ఫార్ములావన్ లాంటి పెద్ద ఈవెంట్లను కూడా చిన్న అంతరాయం కలగకుండా చేశామని తెలిపారు. చివరికి సినిమాలకు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కానీ, ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుందో మీరే చూడండి. నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ సినిమా. ఆయన ఇక్కడ ఏదో రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా నిర్వహించలేని అసమర్థత. అలాంటి పరిస్థితిలోకి ఈ నగరం వెళ్లిపోయింది అంటూ కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు కేటీఆర్.
కాగా, గత రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించతలపెట్టిన ఎన్టీఆర్ దేవర చిత్రంప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. నిర్వాహకులు పరిమితికి మించి పాసులు జారీ చేయడంతో గందరగోళం నెలకొంది. అభిమానుల తాకిడిని నియంత్రించేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేయాల్ని వచ్చింది. అప్పటికే కొందరు అభిమానులు హోటల్ అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేశారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
చివరకు పోలీసుల సూచనతో నిర్వాహకులు ప్రి రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా స్పందించారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం చాలా బాధాకరంగా ఉందన్నారు. నిర్మాతలను, ఈవెంట్ నిర్వాహకులను నిందించడం తగదని అభిమానులకు సూచించారు. సెప్టెంబర్ 27న దేవర సినిమా చూసి అభిమానులందరూ ఆనందించాలని ఎన్టీఆర్ కోరారు.












Click it and Unblock the Notifications