ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శోభా నాయుడు కన్నుమూత
ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శోభా నాయుడు(58) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(అక్టోబర్ 14) తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నెల రోజుల క్రితం ఇంట్లో జారిపడటంతో ఆమె తలకు గాయమైంది.అప్పటినుంచి ఆర్థో న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో ఆమెకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది.హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా అక్కడి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు.
Recommended Video
శోభా నాయుడు 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించారు. క్వీన్స్ మేరీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో ఆరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరిన ఆమె వెంపటి నృత్య రూపాలలోని అన్ని పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించి మెప్పించిన శోభా నాయుడుకు 2001లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. మద్రాస్‌లోని కృష్ణ గాన సభ నుంచి నృత్య చూడామణి బిరుదు కూడా అందుకున్నారు. అలాగే 1991లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు,1996లో నృత్య కళా శిరోమణి అవార్డు,1998లో ఎన్టీఆర్ అవార్డు,ఏపీ ప్రభుత్వ హంస అవార్డులను అందుకున్నారు.

40 ఏళ్లుగా కూచిపూడి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న శోభానాయుడుకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శిష్యులు ఉన్నారు. ఆమె మరణ వార్తతో వారంతా దిగ్భ్రాంతి చెందుతున్నారు. శోభానాయుడు మృతికి అధికార భాషా సంఘం అధ్యక్షులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, ప్రముఖ నాట్య కళాకారుడు కె.వి.వి.సత్యనారాయణ తదితరులు సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications