టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న ఎల్ రమణ .. కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిక
ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎల్ రమణ నేడు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ ఎట్టకేలకు గులాబీ గూటికి చేరారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కారెక్కిన రమణ టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఎల్.రమణ చేరుతున్న సందర్భంగా గులాబీ కండువా కప్పి కేటీఆర్ సాదరంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేయాలని రమణ కు కేటీఆర్ తో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్.రమణ పార్టీలో చేరుతున్న కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తో పాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక ఈనెల 16వ తేదీన సీఎం కేసీఆర్ సమక్షంలో నిర్వహించే సభలో ఎల్ రమణను టిఆర్ఎస్ పార్టీ నేతగా అధినేత కెసిఆర్ ప్రకటించే అవకాశం ఉంది.

టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన ఎల్ రమణ అధినేత చంద్రబాబుకు పంపిన రాజీనామా లేఖలో తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రజల భాగస్వామ్యం కావాలనే భావనతో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరాలని నిర్ణయించుకున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా నా ఎదుగుదలకు తోడ్పాటునందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఆయన ప్రకటించిన మేరకు రాజీనామా చేస్తూ తాజాగా గులాబీ గూటికి చేరి కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications