‘లగచర్ల’పై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం: కొత్తగా ఇండస్ట్రియల్ పార్క్
ఫార్మా పరిశ్రమల ఏర్పాటుపై పెద్ద ఎత్తున నిరసనల రావడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
లచగర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూ సేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల తోపాటు హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజీల ఏర్పాటు ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంది. మూడు గ్రామాల్లో 1358 ఎకరాల భూసేకరణ కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను ఉపసంహరించుకుంది.

ఫార్మా పరిశ్రమలపై లగచర్లలో రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ప్రభుత్వం పునర్ సమీక్షించింది. అక్కడ పెట్టేది ఫార్మావిలేజి కాదని పారిశ్రామిక జోన్ అని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫార్మా విలేజీల ఏర్పాటు కోసం భూసేకరణ ఉపసంహరించుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్‌కు టీజీఐఐసీ తెలిపింది. ఫార్మా విలేజీల బదులుగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం తాజాగా భూసేకరణ ప్రతిపాదనలు సమర్పించింది.
ఈ నేపథ్యంలోనే గతంలో ఫార్మా సిటీ విలేజీల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లను వెనక్కి తీసుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్ ప్రకటనలు జారీ చేశారు. తాజాగా ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణ కోసం తాండూరు సబ్ కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నియమించారు. దీనిపై త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
రైతుల అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న పారిశ్రామిక పార్కులో టెక్స్ టైల్, కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫార్మా కంపెనీలు కాకుండా ఇతర సంస్థలకైతే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని స్థానిక ప్రజలు చెబుతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలకు అవకాశం ఉండే విధంగా టెక్స్ టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.












Click it and Unblock the Notifications