ప్రజావాణిలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై భూ కబ్జా ఫిర్యాదు
హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తున్న విషయం తెలిసిందే. దరఖాస్తులు ఇచ్చేందుకు జ్యోతిబాపూలే ప్రజాభవన్‌కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వానికి సమస్యలు విన్నవించుకునేందుకు నగరవాసులే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దరఖాస్తుదారులు వస్తున్నారు.
భూ సమస్యల పరిష్కారం, పింఛన్ల కోసం ఎక్కువ మంది అర్జీదారులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్లుగా ఎటూ తేలని తమ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారమవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar) తమ భూములు కబ్జా చేశారని బేగంపేట బస్తీ వాసులు ప్రజాభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. బాధితులను ఆందోళనను దానం నాగేందర్ అనుచరుడు నాగరాజు సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. దీన్ని చూసిన బాధితులు అతనిపై దాడికి దిగారు.

బేగంపేట ప్రకాశ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో ఉంటున్న ఇళ్లను కబ్జా చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇక్కడికి వెళ్లినా తమ సమస్య పరిష్కారం కావడం లేదంటూ తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇళ్ల దగ్గర రౌడీషీటర్లను పెట్టి భయపెడుతున్నారని బాధితులు వాపోయారు. దానం నాగేందర్ అనుచరుడు నాగరాజును పోలీసులకు అప్పగించిన బాధితులు సౌత్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్‌కి తమ ఆవేదనను వినిపించారు.
ఇది ఇలావుండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏల సర్దుబాటు కోసం తెచ్చిన జీవో 81,85లను సవరణ చేసి 55 నుంచి 61 వయసు గల వీఆర్ఏ కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితులు ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు విన్నవించుకున్నారు. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు కోరారు.












Click it and Unblock the Notifications