వరంగల్ లో పొలిటికల్ గేమ్: ఢిల్లీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్.. అందుకేనా !
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వరంగల్లో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి దాకా తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్లే నేతలను బాబ్బాబు అంటూ బుజ్జగించుకుంటున్న గులాబీ నేతల తీరు, ఇక అవకాశవాద రాజకీయాలలో భాగంగా జంప్ కొడుతున్న జంప్ జిలానీల వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
నిన్నటికి నిన్న నడిరోడ్డు మీద ఆరూరి రమేష్ కోసం బీఆర్ఎస్, బిజెపి నేతలు కొట్లాడుకున్న ఘటనలను మరిచిపోక ముందే ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు . తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని, బలవంతంగా తీసుకు పోలేదని, తనకు తానుగా హైదరాబాద్ కు, కేసీఆర్ వద్దకు వచ్చానని ఆరూరి రమేష్ చెప్పుకొచ్చారు. తాను అమిత్ షా ను కలవలేదని కూడా చెప్పుకొచ్చారు.

అప్పటికే ఆరూరి రమేష్ అమిత్ షాను కలవడానికి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇదిలా ఉంటే నిన్న కేసీఆర్ తో జరిగిన సమావేశంలో ఫైనల్ గా అభ్యర్థిని ప్రకటించారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కే. కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటన చేశారు.
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావడంతో బీఆర్ఎస్ పార్టీ నుండి ఆమెకు టికెట్ కేటాయించారు. అయితే వరంగల్ లోక్సభ స్థానం నుంచి టికెట్ ఆశించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తాజా పరిణామాలతో నేడు ఢిల్లీకి వెళ్లడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.
నేడు ఢిల్లీలో బిజెపి పెద్దలను కలిసి బిజెపిలో చేరుతారని, వరంగల్ లోక్సభ నుంచి పోటీ చేయడానికి అవకాశం కోసం ఆరూరి రమేష్ పార్టీ మారడానికి రెడీ అయ్యారని ఆసక్తికర చర్చ జరుగుతుంది. నిన్న జరిగిన రగడ తర్వాత ఆయన చేరికపై బీజేపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా వరంగల్లో ఊహించని రాజకీయ పరిణామాలు ప్రస్తుతం చోటు చేసుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications