రాంగ్ కాల్ ప్రేమ: మోసం చేశాడని సీపీకి యువతి ఫిర్యాదు

Subscribe to Oneindia Telugu

వరంగల్‌: ఇద్దరి మధ్య సెల్‌ఫోన్‌లో జరిగిన రాంగ్‌ కాల్‌ పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. పెళ్లి విషయం వచ్చేసరికి ప్రేమికుడు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదంటూ మొహం చాటేశాడు. దీంతో గత్యంతరం లేక బాధితురాలు సీపీ సుధీర్‌బాబును కలిసి మొరపెట్టుకుంది.

బాధితురాలి వివరాల క్రారం... ధర్మసాగర్‌ మండల కేంద్రానికి చెందిన సదరు యువతి వైజాగ్‌లో ఎంఫార్మసీ పూర్తి చేసింది. 2014 అక్టోబర్‌లో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోళి గ్రామానికి చెందిన గొల్ల హరీష్‌తో ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటికే హరీష్‌ సీఆర్‌పీఎస్‌ కానిస్టేబుల్‌గా ఒడిషా రాష్ట్రంలోని మునుగూడలో పనిచేస్తున్నాడు. ఫోన్‌లో ఏర్పడిన వీరి పరిచయం కొద్ది రోజుల తర్వాత ప్రేమగా మారింది. ఇలా మూడు సంవత్సరాలపాటు సాగిన వారి ప్రేమ పెళ్లి చేసుకోవడం వరకు వెళ్లింది.

సుమారు రెండు సార్లు హరీష్‌ తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు. వీరి ప్రేమ డిసెంబర్‌ 2016 వరకు కొనసాగింది. బాధిత యువతి ఎస్సీ, హరీష్‌ బీసీ సామాజిక వర్గం కావడంతో పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. కులం పేరుతో దూషించి అక్కడి నుంచి యువతిని గెంటేశారు.

డిసెంబర్‌ చివరి వారం నుంచి హరీష్‌ సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. పెళ్ళికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంలేదని సదరు యువతితో చెప్పడం మొదలు పెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి.. న్యాయం కోసం జనవరిలో ధర్మసాగర్‌ పోలీసుస్టేషన్‌లో హరీష్‌, ఆయన తండ్రి నర్సయ్య, తల్లి లక్ష్మి, అక్క స్వరూప, బావ తిరుపతిలపై ఫిర్య్యాదు చేసింది.

దర్యాప్తు చేసిన పోలీసులు హరీష్‌, ఆయన తండ్రి నర్సయ్యలతోపాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో హరీష్‌తో పాటు ఆయన తండ్రిని జైలుకు పంపించి మరో ముగ్గురిని అరెస్టు చేయకుండా వదిలివేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబును రెండు సార్లు కలిసి న్యాయం చేయాలని వేడుకోగా డీసీపీ వేణుగోపాల్‌రావును దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

కానీ హరీష్‌ కుటుంబం ఇచ్చిన డబ్బులకు ఆశపడి డీసీపీతో పాటు ఏసీపీ, స్థానిక సీఐ కేసును తప్పుతోవ పట్టిస్తున్నారని బాధిత యువతి ఆరోపిస్తోంది. కాగా, 'ఈ కేసులో ఇప్పికే ఇద్దరు నిందితులను అరెస్టుచేశాం. హరీష్‌ తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. హరీష్‌ చేసిన తప్పుకు తండ్రిని జైలుకు పంపించాం. ఆయన ఉద్యోగం పోయింది. నిందితుడి అక్కా.. బావలు 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని ఆదిలాబాద్‌లో ఉంటున్నారు. సంబంధంలేని వారిపై కేసు పెట్టి అరెస్టు చేయమంటే సరైంది కాదు. ఈ కేసుపై ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తాం' అని జనార్ధన్‌, కాజీపేట ఏసీపీ తెలిపారు.

A girl allegedly complained to Warangal CP on her lover for fraud.

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

జనగామ: గుర్తు తెలియని ఓ యువకుడు రైలు కింద పడి మృతిచెందిన సంఘటన బుధవారం స్థానిక అంబేద్కర్‌నగర్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియాలో ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మండలం మాటేడు గ్రామానికి చెందిన బూర్గుల శ్రీనివాస్‌ (29) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని సిబిఎస్‌ఎస్‌లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడన్నారు. ఉదయం 9.00 గంటల ప్రాంతంలో జనగామలోని అంబ్కేర్‌నగర్‌ ప్రాంతంలోని అప్‌లైను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఆర్థిక ఇబ్బందులేనని వారు అన్నారు. మృతునికి అమ్మా నాన్నతోపాటు సోదరుడు ఉన్నట్లు వారు తెలిపారు. జిఆర్‌పి హెడ్‌కానిస్టేబుల్‌ వైఎన్‌ వెంక్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మావోయిస్టు మిలీషియా కమాండర్‌, సభ్యుల అరెస్ట్‌

వెంకాపురం: సీపీఐ మావోయిస్టు వెంకటాపురం ఏరియా కమిటీకి అనుబంధంగా పనిచేస్తున్న మిలీషీయా కమాండర్‌ను, ఇద్దరు సభ్యులను అరెస్ట్‌ చేసినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. వెంకటాపురం రక్షకభట నిలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

పోలీసులు, ప్రత్యేక బలగాలు, సీఆర్పీఎఫ్‌ 141 బెటాలియన్‌ జవాన్లు రెండు బృందాలుగా విడిపోయి బోదాపురం, సూరవీడుకాలనీ వద్ద బుధవారం ఉదయం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బోదాపురం వద్ద ఒకరు, సూరవీడుకాలనీ వద్ద ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. వారి నుంచి మావోయిస్టు వెంకటాపురం ఏరియా కమిటీకి చెందిన గోడపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

పట్టుబడిన వారిలో ఒకరైన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం భీజాపూర్‌ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన మడివి ఇడమ ఐదు సంవత్సరాల కిందట మావోయిస్టు వెంకటాపురం ఏరియా కమిటీ మిలీషియా సభ్యుడిగా చేరాడు. దళానికి అవసరమైన బియ్యం, కూరగాయలు చేరవేస్తున్నాడు. రెండేళ్ల కిందట మిలీషియా కమాండర్‌గా బాధ్యతలు చేపట్టి పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేస్తున్నాడు.

2016 జూన్‌లో పోలీసులను లక్ష్యంగా చేసుకొని వెంకటాపురం-చర్ల ప్రధాన రహదారిపై మందుపాతర అమర్చిన ఘటనలో ఇడమ పాల్గొన్నాడు. అదే సంవత్సరం నవంబరులో పోలీసులపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. అదే ప్రాంతంలో మావోయిస్టుల పేరుతో బ్యానర్లు కట్టి, రెండో దఫ మందుపాతర ఏర్పాటు చేసిన వ్యవహారంలో పాల్గొన్నాడు.

బోదాపురం వద్ద పట్టుబడిన రౌతు హనుమయ్య, కుర్సం నగేశ్‌ ఆరు సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ మిలీషియా సభ్యులుగా కొనసాగుతున్నారు. పోలీసులను లక్ష్యంగా చేసుకొని మందుపాతరలు అమర్చడం, దళానికి తనిఖీల సమాచారం చేరవేడయంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని ఏఎస్పీ వివరించారు. సమావేశంలో వెంకటాపురం సీఐ రవీందర్‌, ఎస్సై బండారి కుమార్‌, సీఆర్పీఎఫ్‌ సీఐ సుగ్రీవ్‌ పాల్గొన్నారు.

అకారణంగా కేసు పెట్టారు

ఏ పాపం తెలియని రౌతు హనుమయ్యపై పోలీసులు అకారణంగా మావోయిస్టు కేసు పెట్టారని అతని భార్య అరుణకుమారి, కొడుకు నాగబాబు ఆరోపించారు. వెంకటాపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు దగ్గరగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కొత్తపల్లిలో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు.

ఈ నెల 8 తేదీన వాజేడు మండలం చీకుపల్లిలో బంధువుల వివాహానికి వచ్చినప్పుడు పోలీసులు వచ్చి పట్టుకెళ్లారన్నారు. ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నిస్తే మాట్లాడి పంపిస్తామని చెప్పారని, ఇప్పుడు మావోయిస్టులతో సంబంధం ఉన్నట్లు అన్యాయంగా కేసులో ఇరికించినట్లు వాపోయారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl allegedly complained to Warangal CP on her lover for fraud.
Please Wait while comments are loading...