ప్రేమ పెళ్లికి విషాదాంతం: భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. భర్త, అత్తమామల వేధింపులు తాళలేక వారి దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
ప్రేమ పెళ్లి.. ఎనిమిది నెలలకే నూరేళ్లు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ నివాసి అయిన అనూష (20) అదే ప్రాంతానికి చెందిన పరమేష్ గత 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం పరమేష్ తల్లిదండ్రులైన లాలమ్మ, మొగులప్పలకు మొదటి నుంచీ ఇష్టం లేదు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రేమ వివాహం కావడం, దానికి తోడు అదనపు వరకట్నం తీసుకురావాలని అత్తమామలు అనూషను వేధిస్తుండేవారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన గొడవలో భర్త పరమేష్ కూడా తన తల్లిదండ్రులకు వత్తాసు పలికాడు. ముగ్గురూ కలిసి అనూషపై విచక్షణారహితంగా దాడికి దిగారు. అనూష భర్త పరమేష్ రోకలిబండతో కిరాతకంగా ఆమెను చితకబాదాడు. ఈ దాడిలో అనూషకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆసుపత్రిలో మృతి.. నిందితులు పరారీ
తీవ్రంగా గాయపడిన అనూషను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అనూష చనిపోయిందన్న విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేసిన నిందితులు.. వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం పరమేష్, లాలమ్మ, మొగులప్పల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
అనూష తల్లి చంద్రమ్మ తన కూతురు మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని వరకట్నం కోసం అత్తమామలు పలుమార్లు వేధించారని, చివరకు ముగ్గురూ కలిసి పొట్టనబెట్టుకున్నారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.












Click it and Unblock the Notifications